ఢిల్లీ మర్కజ్ మతపరమైన ప్రార్థనలకు షాద్ నగర్ వాసులు
పటేల్ రోడ్డులో మూడు కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం
షాద్ నగర్ మార్చి 31
కరోనా మహమ్మారి బారిన పడి తెలంగాణలో ఆరుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తాజాగా బులెటిన్ విడుదల చేసింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో ఆసుపత్రిలో ఒకరు, గ్లోబల్ ఆసుపత్రిలో ఒకరు, నిజామాబాద్ లో ఒకరు, గద్వాలలో ఒకరు మరణించినట్లు తెలిపింది. ఈ నెల 13 నుంచి 15 వరకు దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మతపరమైన ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో తెలంగాణ నుంచి పలువురు పాల్గొన్నారు. వీరిలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డుకు చెందిన ముగ్గురు మత ప్రార్ధనలకు హాజరయ్యారు. సమావేశాలు ముగిసిన అనంతరం వీరు ఢిల్లీ నుండి స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వీరంతా చికిత్స పొందుతూ మరణించారు. దీనితో కలకలం మొదలైంది. ప్రభుత్వం వీరి వివరాలను షాద్ నగర్ వైద్య ఆరోగ్య, పోలీసుశాఖలకు అందజేశారు. వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని వైద్యఆరోగ్య శాఖ తీవ్రంగా భావిస్తోంది. దీంతో అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలించాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ దీనికి సంబంధించిన షాద్ నగర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందించాలని కోరారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలియడంతో ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొంది.