కరోనాపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి మార్చి31
కోవిడ్ –19 నివారణా చర్యలపై సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు హాజరు అయ్యారు. రాష్ట్రంలో కోవిడ్–19 విస్తరణ, కొత్తగా నమోదైన కేసుల వివరాలను అధికారులు అందించారు. కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని వివరించారు. వీరిలో చాలా మంది ఢిల్లీలో ల్లో నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్ సదస్సుకు హాజరైనవారు, వారి కుటుంబ సభ్యులేనని వెల్లడించారు. రాష్ట్రంనుంచి వెళ్లిన వారు, అదేరోజు రైల్లో ప్రయాణం చేసిన వారి వివరాలను సేకరించామని తెలిపారు. జమాత్ నిర్వాహకులనుంచి, పోలీసులనుంచి, రైల్వే వారినుంచి.. ఇలా వివిధ రకాలుగా సమాకారాన్ని సేకరించి వారిని క్వారంటైన్‌కు, ఐసోలేషన్‌కు తరలిస్తున్నామన్న అధికారులు తెలిపారు. వీరిపై ప్రధానంగా దృష్టిసారించి ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారు స్వచ్ఛందంగా ముందకు వచ్చి చికిత్స తీసుకోవాలి. వైద్యం తీసుకుంటే ఎవ్వరికీ ఏం కాదు, వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు కలిసి వారి అందర్నీ గుర్తించి వారికి పరీక్షలు చేసి, వైద్య సదుపాయాలు అందేలా చేయండని ఆదేశించారు. అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్ –19 నివారణా చర్యలపై సీఎం సమీక్ష అర్బన్ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంపైనా సర్వే జరుగుతుందా? లేదా? అని సీఎం ఆరా తీసారు. ప్రతిరోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలని, సర్వే నిరంతరాయంగా కొనసాగాలని స్పష్టంచేసారు. కరోనా లక్షణాలు ఉన్నవారు ముందుకు వచ్చి వారు ఆరోగ్య వివరాలు అందించాలి. వారు ముందుకు రాకపోతే వారి కుటుంబ సభ్యులకు నష్ట కలుగుతుంది. ప్రజలకోసం, వాళ్ల మంచికోసమే సర్వే జరుగుతోంది. ఈమేరకు ప్రజలకు అవగాహన కలిగించాలి. షెల్టర్లలో ఉన్నవారికి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని క్వారంటైన్ చేయాలని సీఎం అన్నారు. చదువుకున్నవారు, అవగాహన ఉన్న వారు నేరుగా వెబ్‌ద్వారా సొంతంగా తమ ఆరోగ్య పరిస్థితులపై రిపోర్టు చేయవచ్చని అధికారులు తెలిపారు. వెబ్ ద్వారా నమోదు చేయవచ్చు, లేదా కాల్ సెంటర్ ద్వారా చెప్పొచ్చని అధికారులు వివరించారు. అర్బన్ ప్రాంతాల్లో రైతు బజార్లు, మార్కెట్ల వికేంద్రీకరణపై సీఎం ఆరా తీసారు. సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు ద్వారా డోర్ డెలివరీని ప్రోత్సహిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రతి దుకాణం ముందు ప్రకటించిన ధరలతో పట్టికను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.