ప్రజా సమస్యల అధ్యయనం కోసమే యాత్ర
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం నుంచి తెలంగాణలోని మూడు జిల్లాల్లో రాజకీయ యాత్ర చేపట్టనున్నారు. రేపు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానంతరం ఆయన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పవన్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. దర్శనానంతరం యాత్ర ఎలా చేయాలనేది వెల్లడిస్తానని తెలిపారు.కేవలం ప్రజా సమస్యల అధ్యయనం కోసమే యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. పాదయాత్ర వల్ల ఎక్కువ మంది జనాలను కలిసే అవకాశం ఉండదని అన్నారు. 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా కొండగట్టు వద్ద జరిగిన పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని.. తమ కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడం వల్లే యాత్రను కొండగట్టు నుంచి ప్రారంభించనున్నట్లు పవన్ నిన్న పేర్కొన్న విషయం తెలిసిందే.
అంతకుముందు ఆదివారం ఉదయం పవన్ కల్యాణ్ సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చిలో ప్రార్థనలు చేశారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి పవన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే తన సతీమణి అన్నాతో కలిసి పవన్ చర్చికి చేరుకున్నారు. అనంతరం ప్రశాసన్‌నగర్ జనసేన కార్యాలయంలో పవన్‌తో పోలాండ్ ప్రతినిధులు సమావేశమయ్యారు.