YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నాణ్యత అంతంతమాత్రమే..

నాణ్యత అంతంతమాత్రమే..

జలాశయాలు, ఆనకట్టల పరిధిలో చేపడుతున్న పనుల్లో పర్యవేక్షణ కరవవుతోంది. చేస్తుండగానే పనుల ఆనవాళ్లు మారుతున్నాయి. రానున్న ఖరీఫ్‌ నాటికి పనులు గల్లంతయ్యే ప్రమాదాలు లేకపోలేదు. జన్మభూమి కమిటీలు, సాగునీటిసంఘాల ఇష్టానికే అధికారులు పనులు విడిచిపెట్టడంతో వారికి నచ్చినట్లుగా పనులు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. పర్యవేక్షణ అంతగా లేకపోవడంతో కమిటీలు నచ్చినట్లుగా చేపట్టి చేతులు దులుపుకొంటున్నాయి.

వెంగళరాయసాగర్‌  పరిధిలోని 120 పనులు నీరు-చెట్టులో చేపట్టేందుకు రూ.2.20 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో 50 శాతం పనులు జరిగాయి. మిగిలిన పనులు చేపట్టలేకపోయారు. చేసిన పనుల్లో కూడా నాణ్యతా లోపాలు చోటు చేసుకోవడంతో అవి కొట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నాయి. వెంగళరాయ మట్టికట్ట ఎత్తు పెంచేందుకు నిధులు కేటాయించారు. పైన గ్రావెల్‌ వేసి విడిచిపెట్టారు. సక్రమంగా చదును చేయలేదు. ఆయా పనులు కూడా పూర్తిచేయలేదు. వర్షం పడితేపైన నీరు నిల్వ ఉండిపోయే పరిస్థితి ఉంది. అక్కడ నుంచి నీరు దిగువకు పోయేందుకు దోనెలు నిర్మించాలి. ఆయా పనులు చేపట్టక వదిలేశారు. తూములు, సైఫన్లు, రక్షణగోడలు నిర్మించారు. కొన్నిచోట్ల కాంక్రీటు ఊడిపోయి కన్పిస్తోంది. వర్షాకాలంలో అయితే కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. పెద్దగెడ్డ జలాశయం పరిధిలోని 70 పనులు చేపట్టేందుకు రూ.2 కోట్ల వరకూ నిధులు కేటాయించారు. ఇందులో సగం పనులు మాత్రమే చేయగలిగారు. చేపట్టిన పనుల్లో నాణ్యతా లోపాలు దర్శనమిస్తున్నాయి.

రెయిలింగ్ వాల్, పూడికతీత పనులు ఆనవాళ్లు మారాయి. కొన్ని చోట్ల కీలకమైన పనులు చేపట్టలేదు. గతేడాది పడిన గండ్లు కూడా పూడ్చలేదు. అత్యవసర పనుల్లో తాత్సారం కన్పిస్తోంది. రామభద్రపురం మండలం ఏడొంపులగెడ్డ పరిధిలో చెక్‌డ్యాంలు పలు చోట్ల నిర్మించారు. చెక్‌డ్యాంలకు ఇరువైపులా రెయిలింగ్ వాల్  నిర్మించాలి. అవి లేకపోవడంతో వర్షం పడితే నీటి ప్రవాహం ఎక్కువై కోతకు గురయ్యే ప్రమాదాలు ఉన్నాయి. కొన్నిచోట్ల ఆనకట్ట ఎత్తు తగ్గడంతో నీరు నిల్వని దుస్థితి ఉందని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈపనులపై ఆరోపణలు ఉన్నాయి.

నీరు-చెట్టు పనుల్లో నాణ్యతను పర్యవేక్షించేందుకు సరిపడేలా సిబ్బంది లేరు. 17 మండలాలకు సంబంధించి ఒక ఉప కార్యనిర్వాహక ఇంజినీరు ఉండడం, బిల్లులు సకాలంలో ఆన్‌లైన్‌ చేయాల్సిరావడంతో సంబంధిత పనుల ఇంజినీర్లు చెప్పిందే నాణ్యతవిభాగం అధికారులు రికార్డు చేయాల్సి వస్తోంది.  క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన సందర్భాలు తక్కువ. పనుల సంఖ్య వందల్లో ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నారు. పైగా జన్మభూమి, సాగునీటి సంఘాల అధ్యక్షులే ఈ పనులు చేయడం, ఆయా కమిటీలు రాజకీయాలతో ముడిపడి ఉన్నందున బిల్లులు చెల్లింపులు తప్పడంలేదు. నాణ్యత విభాగానికి అదనపు సిబ్బంది ఏర్పాటు చేస్తే పనుల్లో నాణ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదిశగా అడుగులు పడటంలేదు. నీరు-చెట్టు పనులు పారదర్శకంగా చేపట్టామని, రైతుల ఆమోదం మేరకు పనులు జరిగాయని పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్‌ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు లక్ష్మీ, శ్రీనివాసరావు తెలిపారు. పనులపై ఎలాంటి విమర్శలు రాలేదని, ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిచేస్తామని స్పష్టం చేశారు.

పెద్దగెడ్డ ప్రధాన కాలువ పరిధిలో పాచిపెంట వద్ద దోనె పనులు చేపట్టారు. ఇరువైపులా కాంక్రీటు వేసి మట్టికోతకు గురికాకుండా చేయాల్సి ఉంది. ఈ పనులకు సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇరువైపులా కాంక్రీటు వేయాలి. పనులు అసంపూర్తిగా వదిలేయడంతో ఓవైపు మట్టికోతకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వెంగళరాయ మట్టికట్ట పటిష్ఠం చేసేందుకు సుమారు రూ.20 లక్షల వరకూ నిధులు కేటాయించారు. ఇందులో 50 శాతం నిధుల వరకు ఖర్చుచేసినట్లు అధికారులు చూపుతున్నారు. మట్టికట్టపై గ్రావెల్‌ వేసి చదునుచేయడం, దిగువకు నీరు పోయేవిధంగా చిన్నపాటి డ్రైన్లు నిర్మించడం వంటి పనులు చేపట్టాలి. ఈపనులు అసంపూర్తిగానే ఉంచేశారు. వేసిన మట్టిని సక్రమంగా రోలింగు చేయకపోవడంతో కొట్టుకుపోయే విధంగా పనులు ఉన్నాయి.

Related Posts