YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైద్యం అంతా భారం

వైద్యం అంతా భారం

ప్రభుత్వ వైద్యం పేదలకు భారంగా పరిణమిస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలతో ఇతర జిల్లాల రోగులు కూడా కర్నూలు ప్రభుత్వాస్పత్రికి వస్తుండగా ఇక్కడేమో దూది ఉంటే బ్యాండేజీ ఉండటం లేదు. ఔషధాలు, ఇతర శస్త్రచికిత్సలకు అవసరమైన నిల్వలు లేవంటూ పరోక్షంగా ఒక్కో రోగిపై రూ.వేలల్లో భారం మోపుతున్నారు. ఆసుపత్రి ఔషధాలకు ఈ సంవత్సరం వచ్చిన బడ్జెట్‌ రూ.7.88 కోట్లకుగాను 20 శాతం అంటే సుమారు రూ.1.58 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూపాయి విడుదల కాలేదు. ఈ ఏడాది అవసరాల కోసం పెట్టుకున్న ఇండెంట్‌ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవడం చూస్తే పరోక్షంగా రోగులపైనే భారం పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ సంవత్సరం అవసరాలకుగాను సర్జికల్‌ విభాగం నుంచి 16,000 కాటన్‌ రోల్స్‌ ఇండెంట్‌ పెట్టగా డ్రగ్‌ స్టోర్‌ నుంచి 9,400 మాత్రమే సరఫరా చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని సర్జికల్‌ విభాగంలో ఉన్నది 80 మాత్రమే! రోజువారీ అవసరాలకు 30 నుంచి 40 అవసరం. నెలకు 14,400, పదిశాతం అదనంగా కలుపుకొని ఏడాదికి 16,000 రోల్స్‌ అవసరం. ఆసుపత్రిలోని సర్జికల్‌ విభాగంలో ప్రస్తుతం ఉన్న కాటన్‌ రెండు రోజులకు మాత్రమే సరిపోతుంది. ఏపీఎంస్‌ఐడీసీ వారు 250 రోల్స్‌ పంపిస్తామని చూపినా ఇంతవరకు సరఫరా చేయలేదు. గాయపడిన వారికి కట్టు కట్టడానికి బ్యాండేజీలు ఏడాదికి 6,000 రోల్స్‌ అవసరం కాగా ఇప్పటివరకు 5,600 సరఫరా చేశారు. మరో 400 పంపించాలి. ఇక్కడా స్టాక్‌ లేదు. గాజు క్లాత్‌ ఏడాదికి 6,000 ఇండెంట్‌ పెట్టగా డ్రగ్‌స్టోర్‌ నుంచి 5,100 రోల్స్‌ మాత్రమే వచ్చాయి. 900 సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం గోదాములో వీటి నిల్వలు  నిండుకున్నాయి.

పెద్దాసుపత్రిలోని అత్యవసర విభాగంలో నిత్యం 400 నుంచి 500 మంది రోగులు చేరుతుండగా ఓపీలో నిత్యం 2,000 మంది వరకు సేవలు పొందుతున్నారు. ఆసుపత్రిలో ఉండి సేవలు పొందేవారు నిత్యం 1200 నుంచి 1500 మంది ఉంటారు. అత్యవసర విభాగంతోపాటు ఆసుపత్రిలో ఏడు ఆపరేషన్‌ థియేటర్లు ఉండగా చిన్నవి పెద్దవి శస్త్రచికిత్సలు రోజుకు 50 నుంచి 70 వరకు నిర్వహిస్తుంటారు. ఇక్కడ సింహ భాగం దూది అవసరం ఉంటుంది. వీటికి వారం రోజులకు ఒకసారి దూది, గ్లౌజులు సరఫరా చేస్తారు. సర్జికల్‌ సామగ్రి నిల్వలకు సరిపడా బడ్జెట్‌ విడుదల కాకపోవడంతో గత మూడు నెలల నుంచి పెద్దాసుపత్రికి వచ్చిన పేదల జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఆస్పత్రికి 80 శాతం మందులు ఏపీఎంస్‌ఐడీసీ ద్వారా సరఫరా అవుతోంది. ముందస్తు ఇండెంట్‌ పెట్టుకొని మూడు నెలలకు సరిపడా నిల్వ ఉంచుకోవాల్సి ఉంటుంది. సరఫరా కాని పక్షంలో ప్రభుత్వం కేటాయించే 20 శాతం అదనపు బడ్జెట్‌ను వెచ్చించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా ఇప్పటివరకు సర్జికల్‌కు 20 శాతం బడ్జెట్‌లో రూపాయి విడుదల చేయకపోవడంతోపాటు ఏపీఎంఎస్‌ఐడీసీ దూది, గ్లౌజులు పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంతో ఆ భారం రోగులపై పడుతోంది. ఆయా విభాగాల వైద్యులు ముందు మందుల కొరత, ముందు జాగ్రత్త పేరుతో బయటకు రాస్తుండగా డ్రగ్‌ స్టోర్‌ అధికారులు ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతూ సమస్య తీవ్రతను పట్టించుకోవడం లేదు. ఆస్పత్రిలో కార్పొరేట్‌ హంగుల కోసం ఎన్టీఆర్‌ వైద్యసేవల నిధులు ఎక్కువగా ఖర్చుచేస్తున్నారు తప్ప రోగులకు ఉపయోగపడే దూది, గ్లౌజులు, గ్లూకోమీటర్‌ స్లిప్‌లు కొనడం లేదు. అత్యవసర శస్త్రచికిత్సల కోసం కొన్ని పరీక్షలు బయటికి రాస్తున్నారు. వీటిని నిరోధించి రోగులపై ఆర్థిక భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ఆసుపత్రి అధికారులపై ఉంది. అత్యవసర విభాగంలోని శస్త్రచికిత్స గదులతోపాటు వైద్యులు ఉండే గదుల్లో ఏసీలు మరమ్మతులకు గురై పదిరోజులు కావస్తోంది. ఇవి సక్రమంగా పనిచేయకపోతే శస్త్రచికిత్స చేసుకొన్న వారికి ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

Related Posts