కరోనా బారిన పడి 37,820 మందికి పైగా మృతి
అమెరికాలో మూడు వేలు దాటిన మృతుల సంఖ్య: టృంప్ ఆగ్రహం
వాషింగ్టన్ మార్చి 31
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ బారిన పడి 37,820 మందికి పైగా మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 7,85,807 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,65,659 మంది కోలుకున్నారు. యూఎస్‌లో 1,64,253 కేసులు(3,167 మంది మృతి), ఇటలీలో 1,01739 కేసులు(మృతులు 11,591), స్పెయిన్‌లో 87,956 కేసులు(మృతులు 7716), జర్మనీలో 66,885 కేసులు(మృతులు 645), ఫ్రాన్స్‌లో 44550 కేసులు(మృతులు 3024), ఇరాన్‌లో 41,495 కేసులు(మృతులు 2,757), యూకేలో 22,141 కేసులు(1408 మృతులు), స్విట్జర్లాండ్‌లో 15,992 కేసులు(మృతులు 359), నెదర్లాండ్స్‌లో 11,750 కేసులు(మృతులు 864), బెల్జియంలో 11,899 కేసులు(613 మృతులు), దక్షిణ కొరియాలో 9,786 కేసులు(మృతులు 162), టర్కీలో 10,827 కేసులు(మృతులు 168) నమోదు అయ్యాయి. కాగా అమెరికాలో కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య మూడు వేలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది.. ఆ దేశంలో మరణాల సంఖ్య 3008కి చేరుకున్నది. మొత్తం లక్షా 60 వేల మందికి వైరస్ సోకింది. మరోవైపు ఇవాళ వైట్‌హౌజ్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ట్రంప్.. ఓ జర్నలిస్టుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనవసర ప్రశ్నలు అడగవద్దు అంటూ ఆవేశానికి లోనయ్యారు. అమెరికాలో పది లక్‌నల మందికి కరోనా పరీక్షలు చేపట్టినట్లు ట్రంప్ తెలిపారు. ఇదో మైలురాయి అని అన్నారు. ఆ సమయంలో ఓ రిపోర్టర్ ఓ ప్రశ్న వేశారు. దక్షిణ కొరియా తరహాలో ఎందుకు పరీక్షలు చేపట్టడంలేదని ఆ జర్నలిస్టు అడిగారు. దక్షిణ కొరియా గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు అని ట్రంప్ అన్నారు. అప్పుడు ఆ రిపోర్టర్.. దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా అని ప్రశ్నించారు. దానికి వెంటనే ట్రంప్ .. ఆ నగరంలో 38 మిలియన్ల జనాభా ఉందన్నారు. కానీ ట్రంప్ తొందరలో తప్పు చెప్పేశారు. సియోల్‌లో కేవలం 10 మిలియన్ల జనాభా మాత్రమే ఉన్నది. చివరకు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయవద్దూ అంటూ ఆ జర్నలిస్టును ట్రంప్ హెచ్చరించారు.