YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దాహం.. దాహం..

దాహం.. దాహం..

వేసవి కాలం ప్రారంభంలోనే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడుతోంది. వర్షం నీటిని నిల్వ చేసుకోకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. వాగులు, వంకలు వట్టిపోయాయి. భూగర్భజలం అడుగంటిపోతోంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే మే నెలతో నీటి ఎద్దడి తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. రెండేళ్లుగా జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భజలమట్టం గణనీయంగా పడిపోయింది. జిల్లాలోని అనేక మండలాల్లో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. బోర్లు, బావుల్లో నీరు లేక కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

జిల్లా మొత్తంలో ఇప్పుడే గ్రామాల్లో తాగు నీటి సమస్య ఏర్పడిందంటే తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తోంది. 2016లో మార్చి నెల సగటు భూగర్భ జల మట్టం 6.32 మీటర్లు ఉండగా 2017లో 7.93 మీటర్ల లోతుకు పడిపోయింది. అదే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే 9.72 మీటర్లకు పడిపోయింది. వచ్చే మూడు నెలల్లో ఉష్ణోగ్రత తీవ్రత పెరిగి భూగర్భజలాలు మరింత లోతుకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 15 ప్రాంతాల్లో ఫీజోమీటర్ల ద్వారా భూగర్భజలాల పరిస్థితులను అంచనా వేయగా నేరడిగొండ మండలంలో ఫిబ్రవరి నెలలోనే 30.50 మీటర్ల లోతకు చేరుకున్నట్లు తెలిసింది. మరో నాలుగు మండలాల్లో 10 మీటర్ల కంటే దిగువకు భూగర్భజలాలు పడిపోగా, మరో ఆరు మండలాల్లో జిల్లా సగటు కంటే లోతుకు పడిపోయినట్లుగా భూగర్భజలశాఖ నివేదికను బట్టి స్పష్టమవుతోంది.

జిల్లాలోని అనేక మండలాల్లో గతంతో పోలిస్తే భూగర్భజలమట్టం పాతాళంలోకి చేరింది. భూగర్భజలాల పరిస్థితిని అంచనా వేసేందుకు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో నిర్దేశించిన ప్రాంతాల్లో ఫిజోమీటర్ల ద్వారా భూగర్భజలమట్టం అంచనా వేశారు. జిల్లాలోని 15 ప్రాంతాలను గుర్తించి నీటి మట్టం వివరాలు తెలుసుకున్నారు. నెల వారీగా సేకరించిన వివరాల మేరకు ఫిబ్రవరి నెల జిల్లా సగటు భూగర్భ జలమట్టం 9.72 మీటర్ల దిగువకు పడిపోయింది. మండలాల వారీగా పరిశీలిస్తే.. ఆరు మండలాల్లో ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కురిసే ప్రతి చినుకు భూమిలో ఇంకించుకుంటేనే రాబోయే రోజుల్లో నీటి ముప్పును తప్పించుకోవచ్చు. జిల్లాలో కురిసే వర్షం నీరులో 50 శాతం వాగులు, నదుల ద్వారా సముద్రంలో కలుస్తోంది. నీటిని సంరక్షించుకోవల్సిన అవసరముంది. ఇంటింటా ఇంకుడుగుంతలు, చెరువుల పునరుద్ధరణ, కుంటలు, చెక్‌డ్యాంలు తదితర వాటిని నిర్మించాలి. ఇంకుడు గుంతలు తవ్వుకోవడం వల్ల నీరు భూమిలోనే ఇంకి భూగర్భజలమట్టం పెరుగుతుంది. ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోని బాధ్యతగా నిర్మించుకుంటే బోరుబావుల్లో నీటిని సంరక్షించుకున్నవారవుతాం. ఉపాధిహామీ పథకం కింద ఇంకుడుగుంత నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారు.

Related Posts