స్పెయిన్ లో అంత్యక్రియలకు ఆంక్షలు
బెంగళూర్, మార్చి 31
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ మహమ్మారి మొత్తం 200 దేశాలకు వ్యాప్తిచెంది.. దాదాపు 38వేల మందిని బలితీసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7.82 లక్షల మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఐరోపా దేశాల్లో కరోనా దెబ్బకు 27 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఇటలీ, స్పెయిన్‌లోనే కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ దేశాల బాటలోనే అగ్రరాజ్యం అమెరికా కూడా పయనిస్తోంది. కోవిడ్-19 బాధితుల సంఖ్యలో అగ్రస్థానంలో అమెరికా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఆ దేశంలో దాదాపు 1.65 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. మరో 3వేల మంది చనిపోయారు. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వైరస్ మరింత తీవ్రంగా ఉంది.ఇటలీలో 11,500 వేల మంది ప్రాణాలు కోల్పోతే, పక్కనే ఉన్న స్పెయిన్‌లో 7,719 మంది బలయ్యారు. ఐరోపాలోని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, నెదర్లాండ్, బెల్జియంలలోనూ మృత్యుఘోష కొనసాగుతోంది. నాలుగు రోజుల కిందట కరోనాతో స్పెయిన్ యువరాణి థెరిసా కన్నుమూశారు. దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చడంతో స్పెయిన్ ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. వైరస్ కారణంగా లేదా సాధారణంగా ఎవరైనా మృతిచెందితే వారికి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలను జరపడాన్ని నిషేధించింది.ఎవరైనా చనిపోతే కుటుంబసభ్యులతో సహా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువ హాజరుకావొద్దని ఆదేశించింది. అంత్యక్రియలకు ప్రజలు సామూహికంగా వెళ్లొద్దని స్పష్టం చేసింది. అంతేకాదు, వీళ్లు కూడా సామాజిక దూరం పాటించాలని, తప్పనిసరిగా ఒకటి లేదా రెండు మీటర్ల దూరంలోనే ఉండాలని సూచించింది. అక్కడ ఏప్రిల్ 11 వరకు లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.