YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మున్సిపల్ శోభ...!!!

మున్సిపల్  శోభ...!!!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో తొమ్మిది మున్సిపాలిటీలు చేరనున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి భూత్పూర్‌, మక్తల్‌, కోస్గి.. వనపర్తి జిల్లా నుంచి కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత.. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వడ్డేపల్లి, అలంపూర్‌లను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల, వనపర్తి మాత్రమే ఉమ్మడి జిల్లాలో పురపాలికలుగా ఉండేవి. మూడు రోజుల కిందట అన్ని నగర పంచాయతీలను మున్సిపాలటీలుగా ఆప్‌గ్రేడ్‌ చేస్తూ  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్‌, కల్వకుర్తి, బాదేపల్లి, అయిజలతో కలిసి మొత్తం పురపాలికలు పదికి చేరాయి.

రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వం 15వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను కూడా పురపాలికలుగా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా నుంచి తొమ్మిది కొత్త పురపాలికలకు చోటు లభించింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 19 పురపాలికలు అయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ప్రకటించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,135గా ఉన్న గ్రామ పంచాయతీల సంఖ్యను 1,684కి పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అదేరోజు కొత్త పురపాలికల జాబితా ప్రకటించడం విశేషం.

తొలుత కొత్తగా మరిన్ని నగర పంచాయతీలు ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. నగర పంచాయతీలకు ప్రభుత్వం మంగళం పాడటంతో అప్‌గ్రేడ్‌ పొందిన తొమ్మిది గ్రామ పంచాయతీలను నేరుగా పురపాలికలుగా మారుస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆరు పురపాలికలు, నాగర్‌కర్నూలు జిల్లాలో నాలుగు, జోగులాంబ గద్వాలలో నాలుగు, వనపర్తి జిల్లాలో అయిదు పురపాలికలు ఉండనున్నాయి. చిన్నజిల్లాగా ఉన్న వనపర్తికి కొత్తగా నాలుగు పురపాలికలను ఏర్పాటు చేయడం గమనార్హం.

నాగర్‌కర్నూలు జిల్లాలో ఒక్కటి కూడా కొత్త పురపాలికలను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాతే కొత్త పురపాలికలు అవతరించనున్నాయి. పంచాయతీరాజ్‌ చట్టం-2018 ప్రకారం గ్రామ పంచాయతీకి ఎన్నికైన పాలకవర్గం లేకుంటే కొత్తవి తక్షణం అమల్లోకి వస్తాయి. ఉమ్మడి జిల్లాలో పాలకవర్గం లేనివి ఒక్కటీ లేవు. దీంతో ఆయా పంచాయతీల పాలకవర్గాల గడువు  ముగిసేవరకు ఆగాల్సిందే. పురపాలికల ఏర్పాటు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు అధికంగా వస్తాయి. మౌలిక వసతులు మెరుగుపడతాయి. రోడ్డు, నీటి సరఫరా, పారిశుద్ధ్య వ్యవస్థ గాడిలో పడతాయి. వివిధ పథకాలకు చెందిన ప్రత్యేక నిధుల కేటాయింపులు ఉంటాయి. ఇంటి స్థలాలు, భూములు, స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. విద్య, వైద్యం తదితర సౌకర్యాలు మెరుగుపడుతాయి. అధికారుల అందుబాటులో ఉంటారు. దీంతోపాటు ఆస్తిపన్ను కూడా పెరుగుతుంది.

Related Posts