YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

బయటకు రాకపోవడం వల్లనే మార్కండేయుడు బ్రతికిపోయాడు.

బయటకు రాకపోవడం వల్లనే మార్కండేయుడు బ్రతికిపోయాడు.

బయటకు రాకపోవడం వల్లనే మార్కండేయుడు బ్రతికిపోయాడు.
మార్కండేయపురాణం అష్టాదశ పురాణాలలో ఒక్కటి. 
దేశీ కవితా మార్గంలో పాల్కురికి సోమనాథుడు తెలుగులో బసవపురాణం వ్రాశాడు. అందులో వుందీ మార్కండేయ చరిత్ర. పూర్వం మృకండుడనే బుుషి పుంగవుడు వుండేవాడు.జంతువులు తమ శరీరంపై నున్న దురద తీర్చుకోవటానికి రాళ్ళకేసి రుద్దుకొంటాయి. ఇలా శరీరాన్ని రుద్దుకోవటాన్ని మృకండమంటారు.మృకండ మహర్షి ఘోరతపస్సులో వుండగా ప్రకృతిని మరచి శిలలా మారి ఉంటాడు. అలా శిలలా నిశ్చేష్టుడైన ఆ బుుషి శరీరాన్ని దురదపోవటానికి అడవిజంతువులు రాపిడి చేయడం వలన ఇతనికి మృకండుడనే పేరు సార్థకమైంది. ఇతని భార్యపేరు మరుద్వతి.భర్తకు తగ్గ ఉత్తమఇల్లాలు. ఎన్నాళ్ళకు సంతానం కలుగకపోవడంతో మృకండ మహముని కాశీ క్షేత్రానికి వెళ్ళి శంకరుని గురించి తపస్సు చేస్తాడు. అతని తపోనిష్ఠకు సంతసపడిన శివుడు ప్రత్యక్షమై అతనిని పరీక్షింపదలచిమృకండా నీకు సకల దుర్గుణాలు కలిగి చిరంజీవి యైన కొడుకు కావాలో? లేక సకల సద్గుణాలసంపద కలిగి కేవలం 16 సం॥ మాత్రమే జీవించగల కొడుకు కావాలో కోరుకోమంటాడు.అందుకు ఆ మహాముని  లోకహాని కలిగించే చిరంజీవియైన కుమారుడి కంటే కొన్నాళ్ళు జీవించినా ఉత్తముడైన కొడుకు మేలని తలచి అల్పాయుష్కుడైన సంతానాన్ని ప్రసాదించమని కోరుకొంటాడు. మహదేవుడు నీకు త్వరలో పుత్రసంతానం కలుగుతుందని వరమిస్తాడు.అలా శంకర వరప్రసాదంచే జన్మించినవాడే మార్కండేయుడు. మృకండుని కొడుకు కాబట్టి మార్కండేయుడిగా పిలవడం జరిగింది. అతనికి 7 సంవత్సరాలు నిండిన తరువాత ఉపనయనం ఆపైన సకల విద్యలు నేర్పడం జరిగింది.మృత్యు సమీపకాలం దగ్గర పడినపుడు మహాదేవుడిని ఆశ్రయించమని మార్కండేయునికి బ్రహ్మ సూచించడం జరుగుతుంది. బ్రహ్మదేవుని సలహా మేరకు మార్కండేయుడు శివాలయం చేరి గర్భగుడిలోని శివలింగాన్ని అర్చించడం మొదలు పెడతాడు.ఇలా పదమూడు రోజులు గడచిన అనంతరం 14 రోజున యమభటులు మార్కండేయుడి ప్రాణాలను హరించటానికి వస్తారు.శివాలయంలో మహాతేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాలుడిని చూచి కింకరులు భయపడి వెనక్కు వెళ్ళిపోతారు.గడువులోగా జీవుల ప్రాణాలను తీయాలి కనుక విధిలేక యముడే మార్కండేయుడి ప్రాణాలు హరించటానికి బయలుదేరాడు.మార్కండేయా! జాతస్య మరణం దృవమ్ అన్నసంగతి సకల శాస్త్రాలను అభ్యసించిన నీకు తెలియదా ! కనుక శివాలయ గర్భగుడినుండి బయటకు రా నీ జీవాన్ని తీసుకువెళతానని యముడు చెపుతాడు.అలా సమవర్తికి మార్కండేయుల మధ్య పెద్ద సంవాదమే జరుగుతుంది.కోపిష్టుడైన యముడు గర్భగుడిలోనికి పాశాన్ని విసురుతాడు.అదే సమయంలో మహాదేవా రక్షించమని మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొంటాడు.శివలింగాన్ని కౌగిలించుకొన్న మార్కండేయుడిపై యమపాశం పడగానే శంభులింగం మహాశబ్దంతో బ్రద్దలై శివుడు మహాకాలుడై త్రిశూలంతో పాశాన్ని తొలగించి యముడిని తీక్షణదృక్కులతో చూస్తాడు. యముడు క్షమించమని కోరుతాడు.అంతట మహాశివుడి శాంతించి యముడిని క్షమించి మార్కండేయుడికి సంపూర్ణ ఆయుష్సును ప్రసాదిస్తాడు.ఇలా మార్కండేయుడు చిరంజీవిగా జీవిస్తాడు. ఉపసంహారం:- ఆపదలు కలిగినపుడు పెద్దలు చెప్పినట్లుగా వినాలి. మరణకాల సమీపంలో బ్రహ్మ సలహా మేరకు మార్కండేయుడు 14 రోజులు శివాలయం నుండి బయటకు రాకుండా ఉండినందువల్లనే సంపూర్ణాయుష్కుడైనాడు. ఇపుడు మనమేం చేస్తున్నాం, కరోనా ముహమ్మరిని అంతం చేయటానికి బయటకు రావొద్దని మనరాష్ట్రప్రభుత్వం, అధికారులు చెబుతున్నా వింటున్నామా! నిర్లక్ష్యంతో,సడలింపుకాలంలో పనివున్నా లేకపోయినా బయటి రోడ్లపైన విచ్చలవిడిగా కొందరం తిరుగుతున్నాము. అలా తిరగడం వలన కరోనాకు ఎదురెళ్ళి దానిని ఇంటివరకు మోసుకురావటానికి కారణమైతున్నాం. ఇలా కరోనాకు మనమే స్వాగతం పలుకుతూ  వాహకులుగా మారి దీనిని అమాయకులకు సంబంధంలేని ప్రజలకు చివరకు మనం ఎంతో ప్రేమించే కుటుంబసభ్యులకు అంటించి పెనువిపత్తుకు మహానాశనానికి కారణమైతున్నాం. ఇలా చేయడం సబబా. మీరే ఆలోచించండి. 

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts