కొంపముంచిన మర్కాజ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1
ఆరంతస్తుల భవనమది. అందులోనే మసీదు. కొన్ని అంతస్థుల్లో డార్మెటరీలు ఉంటాయి. పదుల సంఖ్యలో ఇక్కడ విశ్రాంతి తీసుకునే వీలుంటుంది. ఇరుకు సందులు. ఒకే గదిలో పదుల సంఖ్యలో బస. ఇదీ మర్కాజ్ లోని మసీదులోని పరిస్థితి. కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విజృంభించడానికి కారణంగా మారింది. ప్రధానంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎక్కువ మంది ఈ మసీదులో జరిగిన ప్రార్థనలకు హాజరయ్యారు. దీంతో మసీదు పెద్దపై చర్యలు తీసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది. దేశ వ్యాప్తంగా 1200 మంది కరోనా వైరస్ సోకితే ఇందులో 800 మంది ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారే కావడం గమనార్హం.ఢిల్లీలో ఉన్న మర్కజ్ మసీదు విషయంపై అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను కలసి పరిస్థితి వివరించారు. ఈ ప్రార్థనలకు మొత్తం 75 దేశాల నుంచి ఎనిమిది వేల మంది హాజరయ్యారని తెలుస్తోంది. మార్చి 13 నుంచి 15వ తేదీ వరకూ మూడు రోజుల పాటు ఇక్కడ ప్రార్థనలు జరిగాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి అందరూ వెళ్లిపోయారు. కేవలం 150 మంది మాత్రమే మసీదులో ఆశ్రయం పొందుతున్నారు. అంటే దాదాపు 7850 మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. వీరంతా దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ కూడా దృష్టి పెట్టింది. ఇండోనేషియా వాసులు వీసా నిబంధలను అతిక్రమించారని హోంశాఖ చెబుతోంది. వారిపై కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే హోంశాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఈ మసీదు ఉండటంతో అక్కడి నుంచి ప్రజలను ప్రత్యేక బస్సుల్లో ఆసుపత్రులకు తరలించిది. వారికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించింది. నిజాముద్దీన్ ప్రాంతాన్ని మొత్తం శానిటైజ్ చేస్తోంది.అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించి సమావేశాన్ని ఏర్పాటు చేసిన మసీదును మూసివేసింది. మతపెద్దలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రార్థనలకు ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, నేపాల్, ధాయ్ లాండ్ దేశాలకు చెందిన వారు కావడంతో హోంశాఖ అప్రమత్తయింది. వీరు తిరిగి తమ దేశాలకు వెళ్లారా? ఇక్కడే ఉన్నారా? అన్న దానిపై ఆరా తీస్తుంది. మొత్తం మీద మర్కజ్ మసీదు మత పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుతోనే ఈరోజు దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.