ఏమి సేతురా లింగా.... ఏమీ సేతు .....
*ఏఁవోనమ్మా, రెక్కాడితే కానీ డొక్కాడని* సంసారంలాగా అయిపోయింది పరిస్థితి. ఏవో *నాలుగు రాళ్ళు వెనకేసారు* కాబట్టి ఈ సమయంలో అక్కరకొస్తున్నాయ్.
ఐనా *కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసింద'ని* ఆయన సంపాదించడం మిగతా వాళ్ళు కూచుని తినడం. *'కూచుని తింటే కొండలైనా కరుగుతాయ'ని* ఊరకే అన్నారా? ఎవర్నని ఏంలాభం? *అయిన వాళ్ళకు ఆకుల్లోనూ కాని వాళ్ళకు కంచాల్లోనూ'* అన్నట్లు తయారయింది. పోనీ సరుకులన్నా దొరుకుతున్నాయా అంటే అదీ లేదు. పొద్దుననంగా వెళ్ళారు. ఉత్త చేతుల్తో తిరిగొచ్చారు. *సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు'* అన్నట్లుంది. పోనీ వీడున్నాడా అంటే *తింగరోడు తిరణాలకు పోతే ఎక్కా దిగా సరిపోయిందని* వెతకని దుకాణం లేదట. ఎన్నాళ్ళుంటుందో ఈ గోల? *తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని* ఆ ఫారిన్ దేశాలకు వెళ్ళొచ్చిన సన్నాసులు ఇంటి పట్టున పడుండక ఊరంతా తిరణాల మాదిరి తగలేసారు.ఐనా నాకు తెలీక అడుగుతాను .... ఇదంతా ఆ ముచ్చు మొహం వెధవలవల్లే వచ్చిందట. *పిల్లలు పుట్టాలని సముద్ర స్నానానికి పోతే నీళ్ళల్లో పడి పెళ్ళాం కొట్టుకుపోయింద'ని* పనికి మాలిన ప్రయోగాలు చేస్తే *వైష్ణవుల కొంపలో గంప* లాగా తయారయింది ప్రపంచఁవంతా. ఆ అమెరికా వాడి పరిస్థితి మరీ అన్యాయంట. *పాండవుల రాజ్యం కౌరవుల తద్దినాలకు సరిపోయింద'ని* వాళ్ళు దాచుకున్న సొమ్మంతా పాయె ..ఐనా అదేం దేశఁవమ్మా? *రోగఁవొచ్చినవాణ్ణి వాటేసుకుని ముద్దెట్టుకుంటారా ఎక్కడైనా?* ' *కాలికి అంటిన దాన్ని నెత్తిన రుద్దుకున్నట్లయింది* ' *అన్నీ తెలిసిన వాడు అమాశ నాడు పోతే ఏఁవీ తెలియని వాడు ఏకాదశి నాడు పోయాడ'ని* మన దేశఁవే నయంలా ఉంది .... నాలుగు పీకి ఇంట్లో కూలేస్తున్నాం. ఇక మనకు దిక్కు ఆ పరమేశ్వరుడే ....*ఒంటి కాయ శొంఠి కొమ్ములాగా* ఉండగలడు .... అమ్మతో కలసీ ఉండగలడు .... ' *తామరాకు మీద నీటి బొట్టు చందం'* ....
అన్నిటికీ ఓం నమః శివాయ అనుకోడమే.