మసీదు నుంచి 2361 మంది బయటకు తరలింపు
హైదరాబాద్ ఏప్రిల్ 1
ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ సమావేశాలకు హాజరైనవారి కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వేట కొనసాగిస్తున్న నేపథ్యంలో కరోనా ఉత్పాతానికి కేంద్రమైన మసీదు నుంచి మొత్తం 2361 మందిని బయటకు తరలించే పని పూర్తయిందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రకటించారు. ఇందుకు 36 గంటలు పట్టిందని ఆయన ట్విట్టర్‌లో వివరించారు. ఆరంతస్థుల ఆ భవనం నుంచి చివరి వ్యక్తిని తెల్లవారుజామున 4 గంటలకు బయటకు తెచ్చామని ఆయన తెలిపారు. ఎందరో వైద్య సిబ్బంది, పోలీసులు, డీటీసీ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా ఒడ్డి ఈ ఆపరేషన్ మను పూర్తి చేశారని సిసోడియా కృతజ్ఞతలు తెలిపారు. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 1830 మంది మార్చి 15-17 తేదీల్లో మర్కజ్‌ను సందర్శించినట్టు ఢి ల్లీ అధికారులు గుర్తించారు. అయితే రిజిస్టర్ చేసుకోనివారు ఎందరో మర్కజ్‌ను సందర్శించారని పలు రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. తబ్లీగీ జమాత్‌కు హాజరైన కనీసం 3,200 మందిని గుర్తించేందుకు 11 రాష్ట్ర ప్ర్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అహోరాత్రాలు కృషి చేస్తున్నాయి.