YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఆక్వా విలవిల

ఆక్వా విలవిల

ఆక్వా విలవిల (పశ్చిమగోదావరి)
ఏలూరు, ఏప్రిల్ 01 (న్యూస్ పల్స్): కరోనా వైరస్‌ ప్రభావం ఆక్వా రంగంపై పడింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. ముఖ్యంగా చేపల విషయంలో భారీ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ఈశాన్య రాష్ట్రాలకు బయలుదేరిన చేపల లోడు లారీలు మార్గమధ్యలో నిలిచిపోయాయి. వాటిని దిగుమతి చేసుకునే పరిస్థితులు ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం కనిపించడం లేదని సమాచారం. కొన్ని రోజుల పాటు నిల్వ చేద్దామన్నా శీతల గిడ్డంగులు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఇలాగే కొనసాగితే అవి కుళ్లిపోయి మరింత నష్టం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కారమార్గం చూపాలని రైతులు కోరుతున్నారు. జిల్లా నుంచి నిత్యం 250 నుంచి 300 లారీల చేపలు ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. భీమవరం, ఆకివీడు, చేబ్రోలు కేంద్రాలుగా చేపల ఎగుమతి జరుగుతోంది. ముఖ్యంగా అసోం, ఒడిశా, పశ్చిమబంగ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం వాటితోపాటు మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు చేపలను దిగుమతి చేసుకునే పరిస్థితి లేదని సమాచారం. మన రాష్ట్రం నుంచి వెళ్లిన చేపల లారీలు మార్గ మధ్యలో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాలు రాకపోకలను నిలిపివేయడం దీనికి కారణంగా తెలుస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా అత్యవసరమైన వాటిని తప్ప మిగిలిన అన్ని రకాల సేవలను ప్రభుత్వాలు నిలిపివేశాయి. అత్యవసరాల జాబితాలో వైద్యం, కూరగాయలు, ఆహార పదార్థాలు వంటివి ఉన్నాయి. చేపలు, రొయ్యలు కూడా ఆహారం కోసమే కాబట్టి వీటిని కూడా నిత్యావసరాల జాబితాలో చేర్చాలని ఆక్వా రంగం ప్రతినిధులు కోరుతున్నారు. ప్రస్తుతం పశ్చిమబంగలో 300 లారీలు, అసోంలో 150 లారీలు, ఒడిశాలో 70 వరకు చేపల లారీలు నిలిచిపోయాయని చేపల ప్యాకింగ్‌ అండ్‌ ట్రేడర్స్‌ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ఆ లారీల్లో ఉన్న సరకు విలువ సుమారు రూ. 62.40 కోట్లుగా పేర్కొన్నారు. సాధారణంగా ఇక్కడి ఎగుమతిదారులకు ఈశాన్య రాష్ట్రాల్లోని దిగుమతి దారుల సంఘాలు నెలకి ఒకసారి డబ్బు చెల్లిస్తాయి. మార్చి 31 నాటికి ఆ మొత్తాలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ప్రధానంగా 120 చేపల ట్రేడర్స్‌ ఉన్నట్లు సమాచారం. సుమారుగా లెక్కిస్తే వారికి ఇప్పటి వరకు రావాల్సిన మొత్తం రూ.200 కోట్లు దాటుతుంది. ప్రస్తుత పరిస్థితిలో ఆ డబ్బులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని జిల్లాలోని ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. చేపల కంటే రొయ్యల పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగ్గానే ఉందని చెప్పాలి. జిల్లా నుంచి ప్రతి రోజు సుమారుగా 20 కంటైనర్లలో రొయ్యల ఎగుమతి జరుగుతుంది. వాటిలో 50 శాతం విశాఖపట్టణం, మిగిలిన 50 శాతం కృష్ణపట్టణం, చెన్నై నౌకాశ్రయాలకు వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యల్లో కొంత కాలంగా ఎక్కువ శాతం చైనాకి ఎగుమతి అవుతున్నట్లు ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చైనా మార్కెట్‌ రొయ్యలను కొనుగోలు చేస్తుందని వారు చెబుతున్నారు.

Related Posts