గోదావరి జిల్లాల్లో కరోనా టెన్షన్
రాజమండ్రి, ఏప్రిల్ 2
పచ్చని పొలాలు, గల గలా పారే గోదావరి తో ప్రకృతి అందాలతో అలరారే తూర్పు గోదావరి జిల్లా కరోనా భయంతో వణికిపోతుంది. కరోనా వైరస్ వీరి భయానికి ప్రధాన కారణం అయ్యింది. రాష్ట్రంలో కరోనా ఘంటారావం మోగిస్తున్న తొలిదశలోనే తూర్పుగోదావరి జిల్లా లో విదేశాలకు చదువుకోవడానికి వెళ్లి వచ్చిన వ్యక్తి తొలి కరోనా పాజిటివ్ కేసు గా రికార్డ్ అయ్యాడు. నాటినుంచి జిల్లాలో వారం పాటు మరో కేసు మాత్రమే నమోదు కావడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్న దశలో ఢిల్లీకి మతప్రార్ధనలకు వెళ్లిన వారిలో కరోనా లక్షణాలు బయటపడటంతో జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దాంతో ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా లో మొత్తం నాలుగు పాజిటివ్ కేసులుగా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది,కాకినాడ నుంచి నలుగురు, రాజమండ్రి నుంచి 20 మంది, మండపేట, సామర్లకోట నుంచి ఒక్కరుగా హస్తినకు వెళ్లినవారుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 26 మంది ని ఇప్పుడు క్వారంటైన్ కి తరలించారు. వీరిలో ఒక వృద్ధుడు కి పరీక్షలో నెగిటివ్ వచ్చినా గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రాజమండ్రి కి చెందిన వారికి ఒకరికి కాకినాడకు చెందినవారిలో ఒకరికి పాజిటివ్ గా బయటపడింది.మిగిలినవారి టెస్ట్ రిపోర్ట్ లు రావాలిసి ఉంది. ఈ వార్త తెలియడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురయ్యారు. ఇక యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది. వాలంటీర్ల ద్వారా మరోసారి ఢిల్లీ బృందాలతో సన్నిహితంగా తిరిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఢిల్లీకి వెళ్లివచ్చిన వారి బంధువులను సయితం క్వారంటైన్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్ డౌన్ కి ముందే జిల్లాకు చేరిన ఢిల్లీ మర్కజ్ బృందం పేరు వింటేనే ఇప్పుడు గోదావరి జిల్లా హడలిపోతుంది. జిల్లాలో కరోనా కల్లోలం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజలు భయపడుతున్నారు. దీంతో జిల్లాలో కరోనా కేసులు నాలుగుకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పెద్దాపురం కవాడీవీధికి చెందిన 65 ఏళ్ల వ్యక్తిని గత ఆదివారం అనుమానిత కేసుగా కాకినాడ జీజీహెచ్‌కు తీసుకురాగా బుధవారం పాజిటివ్‌గా నిర్థారించారు. మంగళ, బుధవారాల్లో నమోదైన మూడు పాజిటివ్ కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే కావడంతో జిల్లా వాసుల దృష్టంతా ఢిల్లీ వెళ్లి వచ్చినవారిపైనే పడింది. లండన్ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన 23 ఏళ్ల యువకుడితో తొలి పాజిటివ్ కేసు నమోదు కాగా కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆ యువకుడు ప్రస్తుతం కోలుకుని రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి అయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ నిజాముద్దీన్ వద్ద జరిగిన ప్రార్థనల్లో పాల్గొని జిల్లాకు తిరిగొచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.