రెట్టింపైన కరోనా కేసులు
జగన్ సీరియస్ వార్నింగ్
విజయవాడ, ఏప్రిల్ 2
కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ప్రపంచ వ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం తాళం వేసుకుని ఇంట్లోనే సేదదీరుతోందని చెప్పాలి. ఇదే పరిస్థితి మన దేశంలోను, మన రాష్ట్రంలోనూ కూడా కనిపిస్తోంది. గత ఆదివారం నుంచి దేశంలో జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ పేర్లతో ప్రజల స్వేచ్ఛా జీవనానికి ప్రభుత్వం ముకుతాడు వేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంంలో ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. ఇక, దేశంలో పరిస్థితిని గమనిస్తే.. ఇతర రాస్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో పరిస్థితి కొంత సానుకూలంగానే ఉందని నిన్నటి వరకు ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. 10 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కూడా సీఎం జగన్ వెల్లడించారు. ఆయన ప్రకటన చేసిన రెండు రోజులకే ఏపీలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది.ఇక, ఇప్పుడు దాదాపు ఆరు జిల్లాల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడికక్కడ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు కల్లలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పటిష్ట చర్యలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉన్న రిలాక్సేషన్ గడువును 11 గంటలకు పరిమితం చేశారు. అంటే ఉదయం ఆరు నుంచి 11 మధ్య మాత్రమే ప్రజలను బయటకు అనుమతిస్తారు. మొత్తంగా ఈ తరహా పరిస్థితిని ప్రభుత్వం తీసుకువస్తుందని ఎవరూ ఊహించలేదు.అయితే, ఈ సమయంలో ప్రజలను కట్టడిచేయడమో.. లేదా.. ప్రజలకు నిత్యావసరాలను సరైన సమయానికి అందించడమో చేయాల్సిన బాధ్యత క్రమశిక్షణతో ప్రజలు మెలిగేలా చూడాల్సిన అవసరం కూడా ఒక్క అధికారులపైనే ఉందా ? పోలీసులపైనే ఉందా ? ప‌్రజాప్రతినిధులకు పట్టదా ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణలో ప్రజాప్రతినిదులు రోడ్ల మీదకి వచ్చి ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, సరుకులు, రేషన్, కూరగాయలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆసుపత్రులను సందర్శిస్తున్నారు. కరోనా బాధితులు ఉన్నారా? లేరా? అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ తరహా స్పృహ ఇక్కడ ఏపీలో కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.ఇదే విషయం నేరుగా సీఎం జగన్ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయన జిల్లా ఇంచార్జ్ మంత్రులను అలెర్ట్ చేశారని తెలిసింది. రేపటి నుంచి ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో లాక్‌డౌన్ బ్రేక్ సమయంలో ఎమ్మెల్యేలు ప్రజలను చైతన్య పరిచి, వారికి నిత్యావసరాలను అందించే చర్యలు తీసుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, శంకర్ నారాయణ, గుమ్మూరు జయరాం లాంటి నేతల ఊసే ఎక్కడా కనపడడం లేదు. జగన్ వార్నింగ్ నేపథ్యంలో అయినా ఇలాంటి మంత్రులతో పాటు ఇతర ఎమ్మెల్యేల్లో చురుకుదనం వస్తారేమో ? చూడాలి.