YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 ప్రకాశంలో కరోనా కలకలం

 ప్రకాశంలో కరోనా కలకలం

 ప్రకాశంలో కరోనా కలకలం
ఒంగోలు, ఏప్రిల్ 2
ప్రకాశం జిల్లాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. జిల్లాలో నమోదైన 11 పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా చీరాలలో 4 కేసులు నమోదు కాగా, కందుకూరులో 3, ఒంగోలు నగరంలో 2, కనిగిరి, కారంచేడులో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను హైరిస్క్‌ జోన్లుగా పేర్కొంటూ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. జిల్లాలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 280 మందిలో సుమారు 100 మందికి పైగా ఆచూకీ తెలియలేదు. వీరందరూ స్వచ్ఛందంగా క్వారంటైన్‌ కేంద్రాలకు వచ్చి వైద్య చికిత్స పొందాలని జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ కోరారు. అంతే కాకుండా వీరి ఆచూకీ కోసం ప్రత్యేక టాస్‌్కఫోర్స్‌ బృందాలు వెతుకులాట ప్రారంభించాయి.మూడు రోజుల క్రితం వరకు లండన్‌ వెళ్లి వచ్చిన యువకునికి తప్ప అతని కుటుంబ సభ్యులకు సైతం నెగిటివ్‌ రిపోర్టు రావడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఓ మతపెద్ద ద్వారా అతని భార్య, కుమారునితోపాటు మరో ఏడుగురికి సైతం కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులతోపాటు ప్రజలు భయకంపితులయ్యారు.ఒంగోలు నగరంలో పాజిటివ్‌ కేసులు నమోదైన వ్యక్తి భార్య ఆ చుట్టు పక్కల పిల్లలకు ట్యూషన్‌ చెప్పిందని గుర్తించిన అధికారులు ట్యూషన్‌కు వెళ్లే పిల్లలను గుర్తించి కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో పాటు వైరస్‌ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వారందరినీ గుర్తించి దగ్గరలోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఉన్న 10 క్వారంటైన్‌ కేంద్రాల్లో ఇప్పటి వరకు 696 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒంగోలు జీజీహెచ్‌లో ఐసోలేషన్‌ వార్డులో ఉన్న వారితోపాటు జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మంది అనుమానిత లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపగా వారి రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటికే 11 కేసులు నమోదు కాగా ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందనే ఆందోళన సర్వత్రా నెలకొంది.చీరాల ప్రాంతం కరోనా కోరల్లోకి వెళ్లింది. ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి జిల్లా నుంచి 280 మంది వెళ్లగా వారిలో 80 మంది చీరాల పరిసర ప్రాంత ప్రజలు కావడం విశేషం. చీరాల మండలంలోని సాల్మన్‌సెంటర్‌ పంచాయతీ నవాబుపేటలో భార్యభర్తలకు కరోనా పాజిటివ్‌ రావడంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. మార్చి 12 చీరాల మండలం సాల్మన్‌సెంటర్‌ పంచాయతీలోని నవాబుపేటకు చెందిన వ్యక్తితో పాటు మరో ఏడుగురు ఇస్తిమాకు చీరాల నుంచి ఢిల్లీ వెళ్లారు. చీరాలలో నాలుగు పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో జిల్లా యాంత్రాంగం చూపు చీరాలపై పడింది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు మొత్తం హుటాహుటిన చీరాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నవాబుపేటకు చెందిన భార్యభర్తలకు పాజిటివ్‌ రావడంతో శనివారం ఆయన కుటుంబంతో సహ గృహనిర్భందంలోకి వెళ్లారు.కందుకూరు పట్టణలంలో కరోనా కలకలం రేపింది. పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. కరోనా సోకిన ముగ్గురు వ్యక్తులు ఢిల్లీలో ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారే కావడం, వారు పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రజలు హడలి పోతున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారు, ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలుతుండడంతో రెండు రోజుల క్రితం వీరిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఈ ముగ్గురికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దాదాపు 10 రోజులపాటు వీరు పట్టణంలో తిరగడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ ముగ్గురు కుటుంబ సభ్యులను అధికారులు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.మక్కా మసీద్‌లో ఇమామ్‌గా పనిచేసిన వ్యక్తి గత శుక్రవారం మసీదులో జరిగిన నమాజ్‌లో పాల్గొన్నారు. ఈ నమాజ్‌లో 80 మంది వరకు పాల్గొన్నట్లు గుర్తించారు. అలాగే బూడిదపాలేనికి చెందిన వ్యక్తి లింగసముద్రంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈయన 50 మందికి పైగా రక్త పరీక్షలు చేసినట్లు తేలింది. వారిలో 42 మంది క్వారంటైన్‌కు స్వయంగా వచ్చారు.కనిగిరిలోని అన్ని గృహాల్లో వైద్య, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే చేపట్టారు. కరోనా బాధితుడు నివాసం ఉంటున్న అర్బన్‌ కాలనీ ప్రాంతాన్ని ఎమ్మెల్యే బుర్రా మధుసుదన్‌ యాదవ్‌తో పాటు, జెడ్పీ సీఈఓ కైలాష్‌ గిరీశ్వర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి నర్శింహారావు,  వైద్యులు, వివిధ శాఖల అధికారులు సందర్శించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి జనతా కర్ఫ్యూ రోజున పోలీసులు, జర్నలిస్టులకు వాటర్‌ బాటిళ్లు, పండ్లు వగైరా పంపిణీ చేశాడు. ఈ నెల 23 నుంచి ఇప్పటి వరకు అతనికి దగ్గరగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరనే దానిపై పూర్తిగా వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామంలో మొత్తం 12 బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రతి ఇంటినీ జల్లెడపడతారన్నారు.పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో అతి సన్నిహితంగా ఉన్న వారి పేర్లుతోపాటు, వారి ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తామన్నారు. గ్రామానికి ఇరువైపులా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  గ్రామంలోకి ఎవరూ రావద్దని, గ్రామస్తులు కూడా ఎవరూ బయటకు వెళ్లవద్దంటూ సూచిస్తున్నారు

Related Posts