మొక్కజొన్న రైతులపై కరోనా ప్రభావం
విజయనగరం, ఏప్రిల్ 2
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం మొక్క జొన్న రైతులనూ విడిచిపెట్టలేదు.చీడపీడలు, ఈదురుగాలులకు పంట నేలకొరగడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. ఇప్పుడు ధరలు గణనీయంగా తగ్గిపోవడంతో మొక్కొజన్న రైతులు నష్టపోతున్నారు. మొక్కజొన్న ఉత్తత్తిలో అధిక శాతం కోళ్ల పరిశ్రమకు వెళ్తుంది. కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రస్తుతం చికెన్ విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఫౌల్ట్రీ యజమానులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీంతో పరిశ్రమను నిలిపివేస్తున్నారు. ఫలితం.. కోళ్లకు మేతగా వినియోగించే మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఈ ప్రభావం రైతులపై పడింది. జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో సుమారు 18వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. ఎకరాకు సుమారు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గత ఖరీఫ్‌లో క్వింటా మొక్కజొన్నలు బస్తా రూ.2,400 నుంచి రూ.2,200 ధర పలికేది. దీంతో సాగు విస్తీర్ణం పెంచారు. పంట చేతికొచ్చేవేళ... దేశంలో కరోనా వైరస్ ప్రభావం కనిపించడంతో ధరలు పడిపోయాయి. ప్రస్తుతం క్వింటా రూ.1300లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో బస్తాపైన సుమారుగా రూ.900లు నష్టపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. దీనిని అదునుగా తీసుకుని వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల పంటను నిలువునా దోచుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.మొక్కజొన్న పంటను కొనుగోలుకు ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు. గడిచిన ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం మొక్కజొన్నపంటకు క్వింటా రూ.1760 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఆ సమయంలో పంట తక్కువగా ఉండడం, మార్కెట్లో ఎక్కువ ధర పలకడంతో రైతులు వ్యాపారులకు అమ్మకాలు జరిపారు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు వ్యాపారులు పంటకు ధరలను అమాంతం తగ్గించేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.