సీతారాముల దాంపత్యం జగతికి ఆరాధ్యం.శ్రీరామునకు తగిన ఇల్లాలు మైథిలి.
పంకజముఖి సీత వంటి భామామణియున్ అన్న అభిమానం ప్రజల్లో నిలిచిపోయింది.మహావీరుడై, శివధనుష్కండనుడైన రఘుకులాన్వయుని పరిణయ మాడిన వధువు మైథిలి. కష్టాల్లో భర్తకు తోడునీడగా నిలిచి అనుకూలవతి, అనురాగవతి,పుత్రవతియునై అభిమానవతిగా భూప్రవేశం చేసేవరకు సీతాపాత్ర అత్యుత్తమమైన,అత్యుత్కృష్ట మైన రీతిలో మలచబడి
” సీతాయా: చరితం మహత్” అని మహర్షి చేతనే కొనియాడ బడిన పవిత్రశీల. జానకీ మాత సకల సద్గుణ సముపేత. తనకు కీడు చేసిన వారికైన హాని చేయనంగీకరించని కరుణామృత మాతృహృదయ మామెది.
“ ప్రణిపాత ప్రపన్నాహి మైథిలీ జనకాత్మజా
పాపానాం వా శుభానాం వా వధార్హాణాం ప్లవంగమ
కార్యం కరుణ మాత్రేణ నకశ్చి న్నాపరాధ్యతి — “ 6. 119-44
పలుకే బంగారంగా బాలకాండ లో అసలు మాట్లాడక దర్శనమాత్రం చేతనే అలరించిన జానకీదేవి సుందరకాండలోఅతిమాత్రంగా సంభాషిస్తుంది. సీతారాముల కళ్యాణం లోకకళ్యాణంగా భావించే భారతజాతి సీతారాముల దాంపత్యాన్ని ఆదర్శదాంపత్యంగా
ఆరాధిస్తోంది. సీతమ్మ లోకారాధ్య.మాతృస్వరూపిణి. శ్రీరాముని సైతం తన కాంతి వలయంలో కప్పివేయగల కాంతిచ్ఛట. ” ఏదేశ వాజ్ఞ్మయమునందైనా
శ్రీరామచంద్రుని వంటి పురుషోత్తముడు లభించినా లభించవచ్చునేమో గాని సీత వంటి ఆదర్శచరిత్రయగు పతివ్రతాతిలకము లభించుట దుర్లభమని “
{శ్రీమద్రా.వైభ. పు.523} పలికిన వివేకానందుని పల్కులు అక్షరసత్యాలు.
ఎన్ని ఇడుముల నెదుర్కొన్నా” భర్తా హి మమదైవతం”
{2.16.89} అని ప్రకటించిన
నిశ్చలనిర్మలహృదయయీమె. లోకం కోసం అగ్నిప్రవేశం చేయించినా, అరణ్యంలో
వదిలేసినా, ఓర్పుతో సహనం తో భర్త గౌరవాన్ని కాపాడి రామచంద్రునిలోకారాధ్యునిగా నిలిపిన ఉత్తమ ఇల్లాలు. రాముడు లోకం కోసం ప్రవర్తించినా
“ నేదానీం త్వదృతే సీతే స్వర్గో 2పి మమరోచతే.“ {2.42.30 }
నీవు లేక స్వర్గమును కూడ అంగీకరించనన్న మధుర భావనను భర్తలో కల్పించిన మహాసాథ్వి.
“ త్వద్వియోగేన మే రామత్యక్తవ్యమిహ జీవితమ్” { 2.5.29} అన్న పల్కులు
రామవియోగాన్ని సహింపలేక మరణిస్తానంటున్న సీతవి. వారి వైవాహిక ప్రణయం
జగదారాధ్యం కావడానికి ప్రధాన కారణం వారిలోని ఆరాధనా భావమే. అది వాల్మీకి అపూర్వ పాత్ర చిత్ర కల్పనా చాతుర్యం.
“ ప్రియా తు సీతా రామస్య దారా పితృకృతా యితి
గుణాద్రూపా గుణాచ్ఛాసి ప్రీతి ర్భూయో2భి వర్థతే. “
వా.1-77-27
తండ్రిచే అంగీకరించబడిన భార్యగా సీతను స్వీకరించినను అనురూప గుణాన్విత,సౌందర్యసముపేత అగుటచే ఆమె యందు అనురాగము వృద్ధిచెందు చున్నది. మరి జానకీదేవి విషయం చూస్తే——
“ తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే
అన్తర్గత మపివ్యక్త మాఖ్యాతి హృదయం హృదా “
వా.1.77.29
“ సీతాహృదయంలో రామచంద్రుడు ద్విగుణుడై వర్తిస్తున్నాడు. ఆమె హృదయాంతర్గతమైన ప్రేమను ఆమె హృదయం అతని హృదయానికి చెప్పుచుండెను.“అని వ్రాయడంలోనే సీతారాముల అన్యోన్యతను వర్ణించడంలో వాల్మీకి లేఖిని పరవశించింది. అంతేకాక “మనస్వీ తద్గతమనా స్తస్యాహృది సమర్పిత: “అంటాడు మహర్షి. సీతమ్మకు మహర్షి వాడిన విశేషణం ”మనస్వీ“ఎంత తియ్యనిమాటో చూడండి. అమ్మ మనస్వి.నిండైన మనస్సుగలది. ఆమె నిండు మనసులో భర్తకు ఎంత ప్రేమను పంచగలదో బిడ్డలకు అంత ప్రేమను అందించ గలదు. అందుకే మహాకవి లేఖిని ఆ కరుణాలవల్లి సీతమ్మకు ”మనస్వి” పదాన్ని వాడింది. వారిరువురి దాంపత్యం అటువంటిది. అందువల్లనే అశోకవనంలో సీతాదేవిని చూచిన హనుమంతుడు “యుక్తా రామస్య భవతీ ధర్మపత్నీ గుణాన్వితా”అంటూ మెచ్చుకుంటాడు. ప్రకృతి ప్రేమస్వరూపిణి. కాని కోపగిస్తే ప్రళయాన్న్ని సృష్టిస్తుంది.అలాగే సీతామాత రామునిచెంత ప్రేమస్వరూపిణిగా గోచరిస్తుందే కాని, శత్రువుల చెంత, రావణాదులను తిరస్కరించి అభిశంసించేటప్పుడు (విమర్శించేప్పుడు) మహాశక్తిగా రూపుదాలుస్తుంది. ఆ ”శక్తి“ పాతివ్రత్య ప్రభావమే. పతివ్రతాసాధ్వి శోక సంతాపాలు కార్చిచ్చులై కాలకూట విషంగా మారి కాముకుల్ని కాల్చివేస్తాయన్న యదార్ధం రావణాదులు తెలుసుకోవడానికి ఆలస్యం పట్టింది. త్రిలోకవిజేతయైన రావణుడు సైతం ”మహాశక్తి” ముందు కంపించిపోయాడు. శక్తిస్వరూపిణి గాథలు కోకొల్లలు. విజయగాథలు ఎప్పుడు మథురంగానే ఉంటాయి.