సీతమ్మ అన్వేషణలో రామయతండ్రి తిరగని కొండలు లేవు.కోనలు లేవు.
అడగని పుట్టా లేదు పురుగూ లేదు.ప్రార్ధించని చెట్టూ చేమా చీకూ చింతా కనపడిన ప్రతి వస్తువునూ అడిగాడు'నా సీతను చూశారా?కనపడితే చెప్పరూ!'అంటూ...
.అలసి సొలసిన రామయ్య నెత్తురోడుతున్న పాదాలతో ఓ బదరీ వృక్షపాదపం చెంత జారగిలబడ్డాడు.'ఎక్కడున్నావు నా ప్రియతమ సీతా!కనపడవా!పువ్వుల నడిగా!మొగ్గలనడిగా!ఎగిరే సీతాకోక చిలకల నడిగా,తూనీగల నడిగా.అడవిలో పక్షులనడిగా కనపడిన ప్రతి జంతువు నడిగా.'నా సీతను కన్నారా? ఎవరినడిగినా మే మెరగమంటే మే మెరగమంటున్నారే!ఎక్కడున్నావు సీతా!కనపడవా!నిన్ను కనుగొనే దారే లేదా సీతా!' కొండాకోనా రామయ్య దీనాలాపనల ప్రతి ధ్వనులతో ప్రకంపించినయి. బదరి చెంత కూర్చున్న రామయ్య జనాంతికంగా మాట్లాడుకుంటూ కంట నీరు ధారలై వరదలై పారేలా,గుండెలవిసేలా విలపించాడు.
'నే చూశాను సీతమ్మను ఓ రామా!విను.నాకు తెలిసినంతలో సీతమ్మ గురించి తెలియపరుస్తాను.'సన్నని గొంతు వినిపించింది.'
'ఎక్కడిదీ గొంతు?ఎవరా మాట్లాడేది.నా గుండెల్లో ఆశ చిగురింపచేసే వారెవరు?'
'ఓ నా రామా!అది నేనే.నీవు సేద తీరుతున్న బదరికనే... రేగుచెట్టును సుమా...
'చెప్పు చెప్పు నీకు తెలిసిందీ సీతను చూసిందీ వివరించు ఓ బదరికా' 'దయచేసి చెప్పు.ఈ రాముడి విశాలహృదయం నిన్ను ఆశీర్వదిస్తుంది' 'అయోధ్యాపతి రామా!విను.ఓ మిట్టమధ్యాన్నం అడవి అంతా ప్రశాంతంగా నిద్రిస్తున్నది,పనికిరాని ఆలోచనలతో నిద్రపట్టని నేను తప్ప.నా ఆలోచనల కంతరాయం కలిగిస్తూ బిగ్గరగా ఓ స్త్రీ ఆర్తనాదం వినిపించింది.'రక్షించండి. రామా !రక్షించు.ఓ నా ప్రియపతీ రామా!రావా నా దగ్గరికి'అంటూ.భయంతో నా హృదయమల్లాడింది.అంతలో మరో కరుకు గొంతు'ఎందుకు రాముడ్ని పిలుస్తావు,నా ప్రియమైన రాణీ!నీ చెంతకు రానే రాడా రాముడు.నీవు నా అధీనంలో వున్నావు.నిన్నెవరూ నా నుంచి కాపాడలేరు.'అని వినపడ్డది.ఆ గొంతు విని నేను నిలువెల్లా వణికిపోయాను.'రామా రామా అనే ఆర్త నాదంతో ఆమె ఆ రాక్షసుడి నుండి పెనుగులాడుతూ నా రాకాసి ముళ్ళకొమ్మలను గట్టిగా పట్టుకున్నది.కానీ రాక్షసుడు ఆమె చెయిపట్టి లాగి తనతో గుంజుకెళ్ళాడు.ఆ పెనుగులాటలో ఆమె చీర చెరుగు నా కొమ్మల ముళ్ళనంటి ముక్కలై గాలికి ఊగుతున్నది చూడు ప్రభూ!'అంది రేగు చెట్టు తన కొమ్మల కేలాడుతున్న పచ్చని చీరముక్కను చూపిస్తూ. ఆ చీర చెరగును చూసిన రామయ్యకు సీతమ్మ జ్ఞాపకాలతో మరోసారి దుఃఖమాగక తలకిందులైనాడు. తమ్ముడు లక్ష్మయ్య ఓదార్చాడన్నయ్యను.'విచారించకన్నా.వదిన దొరకక పోదు.ఆమెను కనుగొంటాం మనం'అన్నాడు. తమ్ముడి ఊరడింపుకు తెప్పరిల్లిన రామయ్య విచారాన్ని వీడి రేగు చెట్టువంక కరుణ నిండిన కళ్ళతో ఆశీపూర్వకంగా చూశాడు.'బదరీ!నీవు ధృడంగా,చెక్కుచెదరక మృత్యుంజయవై జీవిస్తావు.నీవు ఏ ఆయుధంతో గానీ నరకబడవు. సరికదా ఏ నిప్పూ నిన్ను కాల్చలేదు.బండరాళ్ళ మద్యనైనా నీరు లేని చోటయినా,తుఫాను లొచ్చినా,ఎడారిలోనైనా కరువు కాటకాలలో నైనా ఎండావానా చలీ లాంటి ఏ ఋతుకాలాల వల్లా నీకు నాశనమంటూ లేదు.కలకాలం చిరంజీవివై వర్ధిల్లు.ఇది నా వరం.'అని ఆ చోటును వీడాడు తమ్ముడు లక్ష్మయ్యతో. . రాముడి వర ప్రభావానికి నోచుకున్న బదరి(రేగు చెట్టు)ఇప్పటికీ అట్లాగే జీవిస్తున్నది
(గిరిజనుల రామాయణ కథల కాధారంగా అల్లిన గాధ)