తెలంగాణలో కాన్సెప్ట్, ఈ టెక్నో స్కూల్స్ బ్యాన్
హైద్రాబాద్, ఏప్రిల్ 2
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పోరేట్ పాఠశాలల్లో డొనేషన్లు వసూలు చేయకుండా, ఫీజుల పెంపును కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో ఫీజుల వసూళ్లకు సంబంధించి ఏర్పాటు చేసిన రాష్టస్థ్రాయి కమిటీ తన ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. తల్లిదండ్రుల సంఘాలు, పాఠశాలల యాజమాన్యాలు ఈ నివేదికను అధ్యయనం చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం నిబంధనలను రూపొందించి, ఉత్తర్వులు జారీ చేస్తుంది.
* ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలు డొనేషన్లను వసూలు చే యకూడదు. శిశుతరగతులను నడిపే పాఠశాలలుకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.
* దరఖాస్తు రుసుము 100 రూ.లు, రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపాయలు, కాషన్ డిపాజిట్ ఐదువేల రూపాయలకు మించకూడదు. ఒకసారి వసూలు కింద ఇతర ఫీజులేవీ తీసుకోకూడదు.
* 500 రూపాయల మించి లావాదేవీలను చెక్కు లేదా ఆన్‌లైన్‌ద్వారా జరపాలి.
* ఖర్చులను అనుసరించి ట్యూషన్ ఫీజును నిర్ణయిస్తారు.
* ట్యూషన్ ఫీజును మూడు వాయిదాలకు తగ్గకుండా వసూలు చేసుకోవచ్చు.
* పాఠశాలలకు ఐఐటి, ఓలంపియాడ్, కానె్సప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్ర, విజన్, గ్లోబల్, ఎక్సలెన్స్, ఇంటర్నేషనల్, బ్రిలియంట్, ఇగ్నైట్‌మైండ్ తదితర పేర్లు ఉండకూడదు.
* విద్యేతర కార్యక్రమాలు, వాటి ఫీజుల గురించి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే తల్లిదండ్రులకు తెలియచేసి, వారి అంగీకారం పొందాలి.
* విద్య, విద్యేతర కార్యక్రమాలకు, కాషన్ డిపాజిట్లకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరవాలి. ఒకే యాజమాన్యం కింద ఒకటికి మించి పాఠశాలలు ఉంటే , ప్రతి పాఠశాలకు ప్రత్యేకంగా ఖాతాలు ఉండాలి. ఒక బ్రాంచీకి చెందిన నిధులను మరో బ్రాంచీకి మార్చకూడదు.
* ఆ యా పాఠశాలలు నిర్ణయించే ఫీజుల గురించి జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. కలెక్టర్ లేదా అతని ప్రతినిధితో పాటు మరికొందరు అధికారులు ఈ కమిటీలో ఉంటారు. జిల్లా కమిటీ చేసే సిఫార్సులను పరిశీలించి, ఫీజులకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
* సిబ్బందికి ఇచ్చే వేతనాలు, ఇతర ప్రయోజనాలను ఖర్చు కింద తీసుకుంటారు. వారికి బ్యాంకుద్వారా వేతనాలు ఇతర అలవెన్స్‌లు చెల్లిస్తేనే దాన్ని ఖర్చుగా పరిగణిస్తారు.