YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం విదేశీయం

 80 వేల కేసులు.. 5 వేల మరణాలు

 80 వేల కేసులు.. 5 వేల మరణాలు

 80 వేల కేసులు.. 5 వేల మరణాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధించి, ప్రజలను గడప దాటి రాకుండా చేశాయి. ప్రపంచంలోని 200పైగా దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌.. అగ్రరాజ్యాల నుంచి పసికూనలను సైతం గడగడలాడిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ప్రపంచానికి ఉమ్మడి శత్రువుగా ఉగ్రవాదాన్ని పరిగణించారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని కరోనా వైరస్ ఆక్రమించింది. రాజకీయ సిద్ధాంతాలను, ఆలోచనలను పక్కనబెట్టిన ఈ మహమ్మారిని అన్ని దేశాలూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గత 75 ఏళ్లలో ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోందని ఐరాస వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అవగతమవుతుంది.వైరస్ కట్టడికి చర్యలు తీసుకున్నా మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 47 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 9.32 లక్షలు దాటగా, గడచిన 24 గంటల్లో 5వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. ఐరోపా ఖండంలోనే 30వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఖండంలోని ప్రతి నలుగురు మృతుల్లో ముగ్గురు ఇటలీ, స్పెయిన్‌లకు చెందినవారే కావడం బాధాకరం. ఈ రెండు దేశాల్లో ప్రాణనష్టం గణనీయంగా ఉంది.అటు అగ్రరాజ్యం అమెరికాను సైతం కరోనా వణికిస్తోంది. ఇప్పటికే కరోనా మరణాల్లో చైనాను దాటేసిన అమెరికా.. బాధితుల విషయంలో రెండు లక్షలు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9.35 లక్షల మందికి వైరస్ నిర్ధారణ కాగా దాదాపు 1,95,000 మంది కోలుకున్నారు. మరో 6.58 లక్షల మందిలో వైరస్ లక్షణాలు స్వల్పంగా లక్షణాలు ఉన్నాయి. అయితే, దాదాపు 35,500 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది.కరోనా వైరస్ తీవ్రత ఐరోపా దేశాలతోపాటు అమెరికాలో అధికంగా ఉంది. రాబోయే రెండు వారాలు అత్యంత క్లిష్టమైనవని, బాధాకరమైన సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కఠోరమైన రోజులను ఎదుర్కొడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.ఇటలీ, స్పెయిన్‌లలో రోజుకు సగటున 850 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఊహకు అందని రీతిలో ప్రాణనష్టం పెరుగుతోంది. ఒక్క ఇటలీలోనే అక్కడ కోవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,155కు చేరుకోగా... బుధవారం మరో 660 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. కరోనా వైరస్‌తో ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించలేదు. మంగళవారంతో పోల్చితే బుధవారం కేసులు, మరణాల రేటు కొంత తగ్గింది. కొత్తగా దాదాపు 4,000 మందిలో వైరస్ నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య 110,792కి చేరింది.అమెరికాలో కరోనా విజృంభణ మామూలుగా లేదు. ప్రపంచంలో అత్యధికంగా 2.15 లక్షల కరోనా పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసుల నమోదులో ముందు రోజు రికార్డులు కనుమరుగుతున్నాయి. బుధవారం ఏకంగా 27వేలకుపైగా కేసులు నమోదుకావడం గమనార్హం. ప్రస్తుతం ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2.15 లక్షలు దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. న్యూయార్క్, న్యూ జెర్సీ తదితర ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 5,110కు చేరుకోగా.. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ పరీక్షలను దాదాపు 13 లక్షల మందికి నిర్వహించారు.వైరస్‌ తొలిసారి వెలుగుచూసిన చైనాలో వైరస్ తగ్గుముఖం పట్టింది. అయితే, కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా బయటపడని కేసులను 15,41 గుర్తించినట్టు చైనా బుధవారం ప్రకటించింది. దీంతో మళ్లీ అక్కడ వైరస్ జడలు విప్పుతుందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంలో కరోనా వైరస్ వెలుగుచూసిన తర్వాత చైనా ఇలా ప్రకటించడం ఇదే తొలిసారి.స్పెయిన్, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, నెదర్లాండ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా మరణాల్లో స్పెయిన్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఇటలీ తర్వాత ఈ దేశంలోనే అత్యధికంగా 9,387 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం అక్కడ ఏకంగా 900 మంది మృతిచెందగా, కొత్తగా మరో 8,000 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో స్పెయిన్‌లో కోవిడ్-19 బాధితుల సంఖ్య లక్ష దాటేసింది.ఫ్రాన్స్‌, ఇరాన్, బ్రిటన్‌లోనూ కరోనా వైరస్ స్వైరవిహారం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 4,000 మందికిపైగా బలయ్యారు. బుధవారం అక్కడ మరో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 5వేల మందిలో వైరస్ నిర్ధారణ కాగా, మొత్తం కేసులు 56, 989 మందికి వైరస్ సోకింది. జర్మనీలో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నా, మరణాలు మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అక్కడ కరోనా కేసులు 77,981కు చేరాయి. చనిపోయిన వారి సంఖ్య 931కి చేరింది.ఇరాన్‌లో బుధవారం 150 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం 3,036 మంది, బ్రిటన్‌లో దాదాపు 400 మంది చనిపోగా మరణాల సంఖ్య 2,352కు చేరింది. నెదర్లాండ్‌లో 1,173, మంది, స్విట్జర్లాండ్‌లో 488మంది, బెల్జియంలో 828 మంది చనిపోయారు. టర్కీలోనూ కోవిడ్ కేసులు 15,679కు చేరుకోగా, 277 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు బ్రిటన్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 29,150గా నమోదయ్యింది

Related Posts