అమ్మో... భయపెట్టేస్తోంది...కరోనా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2,
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మార్చి 31 నాటికి కోవిడ్ మృతుల సంఖ్య 40 వేలకు చేరింది. అదే సమయంలో ఇన్ఫెక్షన్ బారిన పడిన వారి సంఖ్య 8.5 లక్షలు దాటింది. డిసెంబర్ చివర్లో చైనాలో తొలి కరోనా కేసును గుర్తించగా.. మార్చి 6 నాటికి లక్ష కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కోవిడ్ దూకుడు పెరిగింది. అప్పటికే మిగతా ప్రపంచ దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించడంతో.. మార్చి 18 నాటికి కోవిడ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరింది. అంటే 12 రోజుల్లో కరోనా కేసులు రెట్టిపయ్యాయి. కానీ మార్చి 21 నాటికే మరో లక్ష కోవిడ్ కేసులు పెరిగాయి. మార్చి 24 నాటికి ఈ సంఖ్య 4 లక్షలకు చేరగా.. మార్చి 26 నాటికి ఐదు లక్షలకు, మార్చి 28 నాటికి ఆరు లక్షలకు చేరింది. కరోనా కేసులు నమోదవుతున్న తీరు చూస్తుంటే.. త్వరలోనే 10 లక్షలు దాటడానికి ఇంకెంతో సమయం పట్టదనిపిస్తోంది. కరోనా ఇంతగా ప్రభావం చూపుతుందని మార్చి తొలి వారం వరకు ప్రపంచ దేశాలు ఊహించలేదు. కానీ మార్చిలో కరోనా వ్యాప్తి చెందిన తీరును చూస్తుంటే.. ఏప్రిల్‌లో ఇంకెంత మంది ఈ మహ్మమారి బారిన పడతారో, ఎన్ని లక్షల మంది బలవుతారో ఊహించుకుంటేనే భయం వేస్తోంది.కోవిడ్ దెబ్బకు ప్రపంచం మొత్తం విలవిల్లాడుతోంది. చిన్నా పెద్ద అనే తేడాగా వ్యాపారాలన్నీనిలిచిపోయాయి. చాలా మంది ఇంట్లో నుంచి పని చేస్తున్నారు. కోట్లాది మంది ఉపాధిని కోల్పోయారు. పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాయి. కానీ పేద దేశాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆహారం కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు సరిపోని పరిస్థితిని చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఎన్ని రోజులు ఈ పరిస్థితి కొనసాగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ప్రపంచం సాధారణ స్థితికి చేరుకోవడానికి ఎన్ని వారాలు, నెలల సమయం పడుతుందో తెలియని దుస్థితి. ప్రపంచ యుద్ధాల తర్వాత ఇలాంటి పరిస్థితిని ఇప్పటి వరకూ చూడలేదని ఐక్యరాజ్య సమితి సైతం వాపోయింది.కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్న తీరు ప్రపంచ దేశాలను కలవరానికి గురి చేస్తోంది. మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 10 వేలు దాటగా.. 2.5 లక్షల మంది ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. కానీ మార్చి 25 నాటికి కరోనా మరణాలు, బాధితుల సంఖ్య రెట్టింపు అయ్యింది. కానీ వారంలోపే కరోనా మృతుల సంఖ్య 40 వేలు దాటింది. ఇదే రీతిలో మరో రెండు వారాలపాటు కరోనా మరణాలు సంభవిస్తే.. ఏప్రిల్ నెల సగం పూర్తయ్యే సరికి 1.6 లక్షల మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతారు. పరిస్థితి ఇంతకంటే దిగజారే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే అమెరికా సహా చాలా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రాబోయే 7-21 రోజుల్లో అమెరికాలో కరోనా తీవ్రత గరిష్టానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయంలో కరోనా పీక్ టైం ఉండే అవకాశం ఉంది.అమెరికాలో వచ్చే కొద్ది వారాల్లో కరోనా బారిన పడి లక్ష నుంచి 2.4 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రాబోయే రెండు వారాల్లో కఠినమైన, బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అంటే ఏప్రిల్ నెలలో అమెరికాలో కరోనా విలయ తాండవం చేసే అవకాశం ఉందని సాక్షాత్తూ అధ్యక్షుడే హెచ్చరించారు. వైట్ హౌస్ అంచనా ప్రకారం పరిస్థితి చేజారితే.. అమెరికాలో 20 లక్షల మంది కరోనా బారిన పడి చనిపోయే అవకాశం ఉంది. కనిష్టంగా లక్ష మంది మరణిస్తారని చెబుతున్నారు. ఏప్రిల్ ముగిసే లోగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా కారణంగా చనిపోతారని అంచనా వేస్తున్నారు. ఇటలీ, స్పెయిన్ మాత్రమే కాకుండా మిగతా యూరప్ దేశాల్లోనూ కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.కోవిడ్ కారణంగా ఇటలీలో ఇప్పటికే 12,500 మంది ప్రాణాలు కోల్పోగా... స్పెయిన్‌లో 9 వేల మందికిపై చనిపోయారు. చైనా, దక్షిణ కొరియాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ విదేశాల నుంచి వచ్చే వారితో మరోసారి ఈ దేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడు చైనాలో నమోదవుతున్న కేసులన్న విదేశాల నుంచి దిగుమతి అవుతున్నవే. అమెరికా మరో ఇటలీ కావడానికి ఎంతో సమయం పట్టదనిపిస్తోంది. మరోవైపు బ్రిటన్లోనూ కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఫ్రాన్స్‌లోనూ కరోనా కేసులు, మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. భారత్‌లోనూ ఢిల్లీ మర్కత్ ప్రభావంతో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.చాలా దేశాల్లో ఇప్పటికీ కరోనా పరీక్షల సంఖ్య తక్కువగానే ఉంటోంది. దీంతో ఏ దేశాల్లో ఎప్పుడు కరోనా తీవ్రత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అసలు కరోనా పాజిటివ్‌గా తేలిన వారందర్నీ గుర్తించలేదని.. ఇన్ఫెక్షన్ బారిన పడ్డామని దాదాపు 40 శాతం మందికి తెలియదనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చనిపోతున్న వారిలో 60 ఏళ్లు దాటిన వారే ఎక్కువ. కొన్ని దేశాల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది 5 శాతంలోపే ఉంది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న వేళ.. ఏప్రిల్ గడిచే సరికి ఎంత మందిని ఈ మహమ్మారిని బలి తీసుకుంటుందోనని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి.