కరోనాతో అమెరికా అతలాకుతలం
4వేలమంది మృతి..2.లక్షలు దాటిన కేసులు
సిబ్బందిమ్ సికిస్స సామాగ్రి లేక వైద్యుల ఇబ్బంది
న్యూయార్క్, ఏప్రిల్ 02
: కరోనా వైరస్(కొవిడ్-19) దెబ్బకు అమెరికా అల్లాడుతున్నది. బుధవారంనాటికి ఈ మహమ్మారి నాలుగు వేల మందిని బలితీసుకున్నది. ఆధునిక అమెరికా చరిత్రలోనే ఘోర విషాదాన్ని నింపిన 9/11 దాడులను మించిపోయింది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 1,550 మందికి పైగా మృత్యువాతపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వచ్చే రెండు వారాలు మరింత దుర్భరంగా ఉండనున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలను హెచ్చరించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8.60 లక్షలు దాటింది. 42 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఆల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో దాదాపు 3,000మంది మరణించారు. ఇప్పుడు కరోనా మరణాలు ఆ సంఖ్యను దాటిపోయాయి. జాన్ హోప్కిన్స్ వర్సిటీలోని కరోనా వైరస్ రీసోర్స్ సెంటర్ గణాంకాల ప్రకారం.. బుధవారంనాటికి అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. నాలుగువేల మందికి పైగా మరణించారు. వైరస్ పుట్టినిల్లయిన చైనాను (3,310)ను అమెరికా దాటేసింది. నిర్ణీత దూరాన్ని పాటించడం, వలస కార్మికుల్ని అడ్డుకోవడం వంటి చర్యలతో అమెరికాలో మృతుల సంఖ్య తగ్గిందని అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో ఏర్పాటు చేసిన ‘కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్' సభ్యుడు డీబోరాహ్ బిర్క్స్ తెలిపారు. ఒకవేళ ఈ రెండు చర్యలు తీసుకోకుంటే మరణాల సంఖ్య 15 లక్షల నుంచి 22 లక్షలుగా ఉండేదని హెచ్చరించారు. అమెరికాలో వైరస్‌కు కేంద్రంగాఉన్న న్యూయార్క్ రాష్ట్రం లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 75 వేల కేసులు నమోదయ్యాయని, 1,550 మంది మృతిచెందారని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. గత 24గంటల్లో 332 మంది మరణించినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోనున్నామన్నారు. మరోవైపు న్యూయార్క్ నగరంపైనా కరోనా పంజావిసురుతున్నది. మంగళవారంనాటికి 1,096మంది చనిపోగా, 41,771 మందికి వైరస్ సోకింది. ఇందులో 2000 మంది ఐసీయూలో ఉన్నారు. బాధితులకు చికిత్సనందించేందుకు తగినంత వైద్య సామగ్రి, సిబ్బంది లేక వైద్యులు అవస్థలు పడుతున్నారు.