చిత్రమైన యుధ్ధమిది
చిత్రమైన యుధ్ధమిది
రక్తపుటేరులు పొంగని
నిర్మానుష రణరంగమిది
వికటించిన మానవ మేధకి
ప్రకృతి విసిరిన విషాయుధమిది
నగరం నిశబ్దమవుతూ
రోడ్లు తాచుపాముల్లా భయపెడుతూ
రేపన్నది ప్రశ్నగా మిగల్చాలని
కాలం మ్రోగిస్తున్న మరణమృదంగమిది
అయితేనేమీ
మనం ఎన్ని యుధ్ధాలు చేయలేదు
ఎన్ని తంత్రాలు కుతంత్రాలు ఛేదించలేదు
ఎన్ని ఆపత్తులు విపత్తులు ఎదుర్కోలేదు
ఎన్ని సార్లు నువ్వు నేను ఛిద్రమవ్వలేదు
కరోనా అయినా మరేదైనా
సూక్ష్మమైనా స్థూలమైనా
దాని పుట్టుక తెలుసుకున్నాక
అంతం చేసే మంత్రదండం ఉన్నది మన దగ్గరే
రాకెట్ కంటే వేగంగా
దూసుకుపోయే మేధ మన సొత్తే
సహస్రనామాలు వేదఘోషలు
సుబహ్ కీ అజాలు
ఓంకార నాదాలు
ఆమీన్ అంటూ ప్రార్ధనలు
గురుగ్రంథ్ సాహీబా గుర్బానీలు
ఇవే కదా ప్రతి గృహంలో ప్రతిద్వనించే ఆంటీ వైరల్ డిస్ ఇంఫెక్టంట్ లు
యుగయుగాలుగా యాగాలు చేసి
ఆ నింగిని ఈ నేలనీ
మధ్యలో వాయువుని ఆంటీ బైయోటిక్ గా మార్చింది మన పుణ్యభూమే
వేల సంవత్సరాల నాటి ఆయుర్వేదం
చరఖ సంహిత శుశృత వైద్య ప్రిస్క్రిప్షన్లు మనవే
ధన్వంతరి వారసులం విరుగుడు త్వరలోనే కనుక్కుంటాం
అందాకా ...
మనల్ని మనం గృహ సీమలో నిర్బంధించుకుందాం
అంత మాత్రాన
కాలం ఏమీ ఆగి పోదు
మనం శూన్యమైపోము
తడి మడి మనకు కొత్త కానే కాదు
నఖాబ్ లు మనకు చిరాకు తెప్పించవు
వాకింగ్ లేదని టాకింగ్ మాని
వంద సూర్య నమస్కారాలు రోజు చేద్దాం
ఎందుకో ఏవిటో ఎలానో ఎపుడో అన్న నెగటివ్ ప్రశ్నలు మాని
గడిచే క్షణాలని చిరునవ్వుతో స్వాగతించి పాసిటివ్ ఔరాని ఆహ్వానిద్దాం
పొద్దేపోదు అని నిరాశల్లోకీ జారకుండా
ధ్యానం జ్ఞానం మనలో నింపుకుందాం
భవసాగరంలో మునిగి
మనల్ని మనం ఏనాడో మరిచిపోయాం
ఒక్కసారి మనతో మనం మాట్లాడుకుందాం
జీవిత పుటాలని తిరగేస్తూ
చేసిన తప్పిదాలను ఒప్పుకుంటూ
మనల్ని మనం కొత్తగా లిఖించుకుందాం
హృదయపు తెర వెనుక ఏ అహమో మొహమాటమో అడ్డొచ్చి
ఏ స్నేహాన్నో దూరం చేసుకొని ఉంటాం
ఇప్పుడు ఆ ఇజాలన్నీ మాఫీ చేసి
ఆత్మీయులని ఆక్టివేట్ చేసుకుందాం
ఏ మూలో నక్కి ఉన్న ఫోటో ఆల్బం తెరిచి
మసిబట్టిన బంధాలని తాజాగా శుభ్రం చేసుకుందాం
ఎన్నాళ్లయ్యిందో ఇంట్లో అందరితో మనసువిప్పి కబుర్లు చెప్పి
రండి....
కలిసి రెండు ముద్దలు తింటూ ఆప్యాయతలని పంచుకుందాం
జ్నాపకాల్లో మాత్రమే మిగిలిన
అష్టాచెమ్మా మళ్లీ ఆడుకుందాం
తాతముత్తాతల ఆరోగ్య సూత్రాలు
నియమ నిబంధనలు పాటిస్తూ
కుటుంబాన్ని రక్షించే డిగ్రీ లేని వైద్యుడవుదాం
గొళ్లెంవేసి ఇంటిని కాపాడే సాయుధ పోలీస్ మనమవుదాం
కరోనా ప్రబలకుండా జాగ్రత్త పడదాం
అదిగో....
ఏ దుష్ట శక్తో మన ఇంటికి ఆవల దాగి ఉన్నది
మానసిక స్వస్థతపై దాడీ చేయాలని పొంచి ఉన్నది
బస్తీలో గస్తీలు మాని
ఉమ్మడిగా ఒకరికొకరు ధైర్యం చెబుతూ
సంయమనం పాటిద్దాం
అమావాస్య చీకట్లు తప్పక తొలుగుతాయి
పున్నమి వెన్నెల ఇంకో ఆమడ దూరంలోనే ఉంది
కలిసికట్టుగా ఈ యుధ్ధాన్ని యోధులమై ఎదుర్కుందాం
మశూచినే మట్టుబెటిన ఘనులం
వికారిలో వికటించిన కరోనాని
శార్వరిలో శ్వాస ఆడకుండా చేద్దాం
చేయి చేయి కలపకుండా
ఒక్కమాటపై నిలబడి
ఈ ఆపత్తుని దాటేద్దాం