తమలపాకకు కరోనా దెబ్బ
ఏలూరు, ఏప్రిల్ 3
తమలపాకు పంటకు కరోనా దెబ్బ తగిలింది. పశ్చిమ డెల్టాలో సుమారు 300 ఎకరాలలో తమలపాకు సాగవుతోంది. ప్రస్తుతం తోటలన్నీ కోతకు వచ్చి ఉన్నాయి. కరోనా వైరస్ వల్ల తమలపాకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఇదే పరిస్థితి మరో 15 రోజులు కొనసాగితే రైతులకు రూ.లక్షల్లో నష్టం వస్తుంది. తమలపాకు ఎగుమతి వ్యాపారానికి దొడ్డిపట్ల గ్రామం ప్రసిద్ధి. ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరితీరం వెంబడి లంక గ్రామాలైన లక్ష్మీపాలెం, అబ్బిరాజుపాలెం, కనకాయలంక, పెదలంక, బూరుగుపల్లి, కంచుస్థంభంపాలెం, భీమలాపురం, కోడేరు, ఆనగార్లంక గ్రామాల్లో తమలపాకు సాగుచేస్తున్నారు. ఇక్కడ పండే తమలపాకులన్నీ దొడ్డిపట్ల కేంద్రంగానే లారీల్లోకి ఎగుమతి కాగా మహారాష్ట్రలోని ముంబై, పుణె, నాగపూర్, బుసావళి, కాంగం, యవత్‌మాల్‌తోపాటు హైదరాబాద్‌కు వెళ్తాయి. దొడ్డిపట్ల నుంచి రోజుకు వెయ్యి బుట్టలు ఎగుమతి అవుతాయి.ప్రస్తుతం మార్కెట్‌లో బుట్ట తమలపాకులకు రూ.600 నుంచి రూ.700 వరకు ధర ఉంది. అంటే దొడ్డిపట్ల కేంద్రంగా రోజుకి రూ.12 లక్షలు నుంచి రూ.14 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. మార్చి 15 నుంచి జూలై 15 వరకు సీజన్ ఉంటుంది. అంటే ఈ నాలుగు నెలల కాలంలో నెలకు సుమారు రూ.4 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. అంటే సీజన్ మొత్తానికి రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని తమలపాకుల ఎగుమతిదారుడు ఓదూరి భాస్కరరావు చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో రవాణా మొత్తం బంద్ కావడంతో చేతికి వచ్చిన పంట ఎక్కడ నష్టపోతామోననే భయం రైతులను వెంటాడుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి కాయకూరలు ఎగుమతికి అవకాశం ఇచ్చిన విధంగానే తమలపాకు పంట ఎగుమతులకు అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.