పకడ్బందీగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
మహబూబ్ నగర్ ఏప్రిల్ 3
రబీలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ ,పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ లో జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం సేకరణకు 37 వేల కోట్ల రూపాయలు సమకూరచిందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని, రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో 225 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, గ్రామ పంచాయతీల వారీగా దాన్యం కొనుగోలు కేంద్రాలు గుర్తించామని చెప్పారు. గ్రామాలలో రైతుబంధు సభ్యులు, గ్రామ, మండల స్థాయి కమిటీలు పూర్తి స్థాయిలో పాల్గొని సహకారం అందించాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. అంతేకాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డైరెక్టర్లు, అధ్యక్షులు, సభ్యులు అందరూ సహకారం అందించాలని, ఒక పద్ధతి ప్రకారం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. వారి పంట కోసేందుకు జిల్లాలో 676 వారి కొత్త యంత్రాలు సిద్ధంగా ఉన్నాయని,కోతల సమయంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని , కోతలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయాలని చెప్పారు.