నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు
చిన్న పిల్లలు బయట ఆడుతున్నట్లైతే తల్లిదండ్రులపై కేసులు
మసీదులు, దేవాలయాలు, ప్రార్ధన మందిరాలలో నిఘా
- జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
ఆదిలాబాద్ ఏప్రిల్ 03
ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఏ.శ్రీదేవసేన హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రత్యక ఇంటర్వ్యూలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందని, అట్టి మార్గదర్శకాలను పాటించని, ఉల్లంఘించే వారిపై డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు, ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ ల ప్రత్యేక అధికారులు, ఆయా వార్డ్ లలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయాలనీ, వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వార్డులలో స్ప్రే చేయించాలని, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ కు తరలించాలని సూచించారు. మహాలక్ష్మి వాడ, హమాలీ వాడ లో జూదం ఆడుతున్నట్లు, అక్రమ మద్యం అమ్ముతున్నట్లు సమాచారం ఉందని అలాంటి వారిని అరెస్ట్ చేయాలనీ పోలీస్ అధికారులను ఆదేశించారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు చేపట్టనట్లతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. చిన్న పిల్లలు బయటకు వచ్చి ఆడుతున్నట్లైతే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, పిల్లలు బయటకు రాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని అన్నారు. యువకులు అనవసరంగా బయట తిరుగుతున్నారని, అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలనీ పోలీసు అధికారులకు ఆదేశించామన్నారు. మసీదులు, దేవాలయాలు, ప్రార్ధన మందిరాలలో ఎక్కువ మంది వస్తున్నట్లు సమాచారం అందిందని, అలాంటి ప్రాంతాలలో నిఘా ఏర్పాటు,చేశామన్నారుకూరగాయలు, మాసం విక్రయ కేంద్రాలు, దుకాణాలలో క్యూ పద్ధతి పాటించడం, సామాజిక దూరం పాటించే విధంగా చూడాలని, అలాంటివి పాటించని వారి దుకాణాలను మూసి వేయాలని అన్నారు. వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, బహిరంగ మల విసర్జన చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారులకు సూచించామన్నారు. ప్రత్యేక అధికారులకు మైక్ సెట్లను అందిస్తున్నామని, వాటి ద్వారా వార్డులలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని, కూరగాయలు, మందులు, ఇతర కొనుగోలుకు ఒక్కరు మాత్రమే బయటకు వెళ్లాలని, ద్విచక్ర వాహనాలపై ఒకరి కంటే ఎక్కువ, నాలుగు చక్రాల వాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువ ప్రయాణిస్తే ఆయా వ్యక్తులపై కేసులు నమోదు చేయాలనీ, ఆయా వాహనాలను సీజ్ చేయాలనీ అన్నారు. ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుడదని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. గుట్కా, కల్లు, మద్యం ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మిన, సేవించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. "నా వంతు" అనే కార్యక్రమం కింద నిత్యావసర సరుకులు, ఇతరత్రా ఇంటింటినుండి సీకరించాలని ప్రత్యేక అధికారులకు సూచించామన్నారు. ప్రతి వాడ కు ఒక వ్యక్తిని గుర్తించి, ఆ వాడ లో గల్లీ వాలంటీర్ గా నియమించి ఎవరిని బయటకు రాకుండా చూడడం, కోవిడ్ నిబంధనలను పాటించనవీ గుర్తించడం, గుమిగూడకుండా చూడడం, పిల్లలు బయటకు రాకుండా అవగాహన కల్పించడం, సామాజిక దూరం పాటించడం వంటి పనులను పర్యవేక్షింప చేయడానికి నియమించాలని ప్రత్యేక అధికారులకు సూచించామన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిని గుర్తించి వారి వివరాలు సేకరించి హోమ్ క్వారంటైన్ చేయాలని అన్నారు. వలస కూలీలు, స్థానిక కూలీలు, పేదవారిని గుర్తించి వారికి భోజనం వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. తాగుబోతులను గుర్తించి మానసిక వైద్యుడితో కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించారు. ప్రజలకు నిత్యావసర సరుకుల రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇతర ప్రాంతాలనుండి వ్యక్తులను హోమ్ క్వారంటైన్ చేయాలనీ, వలస కూలీలకు అవసరమైన బియ్యం, మందులు అందించాలని, నిర్దేశించిన ప్రాంతాలలోని భవనాలలో వసతి కల్పించాలని అన్నారు.