కరోనా కట్టడికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక కోచ్ లు
విజయవాడ ఏప్రిల్ 3
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ కరోనా కట్టడికి తన వంతు సాయం చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎనిమిది కేంద్రాలలో దాదాపు 500 ఐసోలేషన్ బెడ్స్ ను రడీ చేశారు. రైల్వే ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, శిక్షణా సంస్థలను కరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చారు.ఇప్పుడు కొత్త ప్రయోగం చేశారు. రైల్వే బోగీలను అధునాతన సౌకర్యాలతో ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు. విజయవాడ, కాకినాడ, నర్సాపూర్, మచిలీపట్నం రైల్వే డిపోలలో ఈ రైల్వే ఐసోలేషన్ కోచ్ లు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం 32 స్లీపర్ కోచ్ లను ఈ విధంగా మార్పులు చేశారు.ఈ కోచ్ లలో సౌకర్యవంతమైన పడకలు, పరిశుభ్రమైన టాయిలెట్లు ఉంటాయి. చెత్త కలెక్ట్ చేయడానికి డస్టుబిన్స్ నుంచి అన్నీ ఏర్పాటు చేశారు. ఎవరికి వారు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా ప్రతి బెర్త్ కు మంచి కర్టెన్లు ఏర్పాటు చేశారు. ఈ అధునాతన బోగీలను రూపొందించిన సిబ్బందిని విజయవాడ డివిజనల్ మేనేజర్ పి.శ్రీనివాస్ అభినందించారు. విజయవాడ కోచింగ్ డిపో అధికారి జి.ఉదయభాస్కర్ ఆయన సిబ్బంది చేసిన ప్రయత్నం ఎంతో బాగుందని ఆయన అన్నారు.