అటు సమ్మర్... ఇటు కరోనా
నల్గొండ, ఏప్రిల్ 4
అటు కరోనా విజృంభిస్తుంటే..మరోవైపు ఎండ మెల్లిమెల్లిగా ప్రతాపం చూపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రాకాసి వల్ల ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేల సంఖ్యలో చనిపోతుండగా..లక్షలాది సంఖ్యలో వైరస్ బారిన పడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారతదేశంలోకి ప్రవేశించిన ఈ మహమ్మారి..తెలుగు రాష్ట్రాల్లో ప్రతాపం చూపెడుతోంది.తెలంగాణాలో 9 మంది చనిపోగా 127 మందికి కరోనా వైరస్ సోకింది. ఇదిలా ఉంటే.. దేశంలోకెల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లోనే ఈసారి ఎండాకాలం అత్యధికంగా ఉండనుందని వాతావరణ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. అన్నట్లుగానే..ఎండలు ఏప్రిల్ నెల ప్రారంభంలోనే దంచికొడుతున్నాయి. ఎండతో పాటు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఇటీవలే ఏపీలోని అనంతలో 41 డిగ్రీలు నమోదైంది. 2020, ఏప్రిల్ 01వ తేదీ బుధవారం పగలు తెలంగాణలోని భద్రాద్రి జిల్లా గరిమెళ్లపాడులో 42.2, జూలూరుపాడులో 41.9, భద్రాచలంలో 40.6, హైదరాబాద్ లో 38.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెల్లవారుజామున హైదరాబాద్ లో 24.6, ఖమ్మంలో 27.4, రామగుండంలో 24.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి వేళల్లో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కర్ణాటక నుంచి మరఠ్వాడ వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి నెల చివరి వారం నుంచి ఎండలు ప్రారంభమై..మార్చి నెలలో ఎండలు తీవ్రమౌతుంటాయి. కానీ కొంతభిన్నమైన వాతావరణం కనిపించింది. మార్చి నెలాఖరులో కొంత వర్షం పడింది. మారుమూల ప్రాంతాల్లో సైతం వర్షం పడింది.ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. వృద్దులు, బాలింతలు, గర్భిణీలు, చిన్న పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల వరకు..క్రమక్రమంగా పెరుగుతున్నాయి.