ఇటలీలో బుట్టల్లో భోజనం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4
కరోనా వైరస్ సంపన్నులు తీసుకొచ్చినా.. దాని వల్ల ఎక్కువ కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటోంది పేదలే. రోజూ కూలి పనులు చేస్తేనే కడుపు నిండని పరిస్థితులు. ఇప్పుడు ఒక్క పని కూడా లేక, చేతుల్లో డబ్బులు లేక వారు పడుతున్న అవస్థలు తెలిస్తే గుండె బరువెక్కుతుంది. అలాంటివారిని ఎవరు పట్టించుకుంటారు? ప్రభుత్వమా? ప్రజలా?ప్రభుత్వం అందించే సాయం నూరు శాతం పేదలకు అందుతుందనే గ్యారంటీ లేదు. అందుకే.. ఇటలీ ప్రజలు ప్రభుత్వం గురించి ఆలోచించకుండా తమకి తామే తోటి మనుషులను కాపాడుకొనేందుకు ముందుకొస్తున్నారు. ఇంటి నుంచి బయటకు రాకపోయినా.. కూడు, నీడ లేక రోడ్లపై తిరిగే పేదల కోసం తాము తయారు చేసుకున్న, నిల్వ ఉంచుకున్న ఆహారంలో కొంత వారికి ఇస్తున్నారు. ఈ సందర్భంగా తమ ఇళ్ల ముందు బుట్టలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో ఆహార పదార్థాలను ఉంచుతున్నారు. ఆహారం అవసరమైన వారు ఈ బుట్టలో ఉన్న ఫుడ్ తీసుకోవాలని చీటీ పెడుతున్నారు. (చివరిలో.. ఇటాలియన్లు ఏ విధంగా ఆహారాన్ని బుట్టల్లో పెడుతున్నారో తెలిపే వీడియోను చూడగలరు).ఇటలీలోని నెప్లస్ నగరంలో ‘సపోర్ట్ బాస్కెట్స్’ పేరుతో ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ముందుగా ఓ వీధిలో ప్రజలు తమ ఇంటి ముందు బుట్టల్లో ఆహారాన్ని పెట్టారు. ఈ మంచి పని మిగతావారికీ తెలిసింది. దీంతో వారు కూడా తమ ఇళ్ల ముందు బుట్టలను వేలాడదీసి ఆహారాన్ని ఉంచుతున్నారు. ఆకలితో అలమటిస్తున్న ప్రజల కడుపు నింపుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇటలీలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల ముందు బుట్టలు వేలాడదీస్తున్నారు.ఇటలీలో పేదల కోసం ఇలాంటి బుట్టలు ఏర్పాటు చేసే సాంప్రదాయం పూర్వం నుంచే ఉందని టామ్ అనే ట్విట్టర్ యూజర్ తెలిపాడు. ఈ బుట్టలను ఏర్పాటు చేసేప్పుడు దీనిపై చక్కని విషయాన్ని తెలియజేస్తారు. ‘‘నీకు దీన్ని(బుట్ట) నింపే స్థోమత లేదంటే.. నువ్వు దీని నుంచి ఏదైనా తీసుకోనే అర్హత ఉందని అర్థం. నీకు దీన్ని నింపే స్థోమత ఉన్నట్లయితే.. ఏమీ లేని వ్యక్తుల కోసం నువ్వు ఇందులో ఏమైనా పెట్టవచ్చు’’ అని తెలిపే చీటలను పెడతారు. అంటే.. ఇతరులకు ఆహారాన్ని పెట్టగలిగే వ్యక్తి ఆ బుట్టలో ఏమైనా పెట్టవచ్చు. ఆకలితో ఉన్న వ్యక్తి అందులో నుంచి ఏమైనా తీసుకోవచ్చు.నెప్లస్ నగర ప్రజలు చాలా మంచిగా ప్రవర్తిస్తారని, అలాంటి ప్రజలను ప్రపంచంలో మరెక్కడా చూడలేమని ఓ ట్విట్టర్ యూజర్ తెలిపాడు. ఇటలీలో లాక్‌డౌన్ వల్ల చాలామంది ప్రజలు ఉపాధిలేక ఆకలితో అలమటిస్తున్నారని, అలాంటివారి కడుపు నింపేందుకు ‘సపోర్టింగ్ బాస్కెట్స్’ ఆలోచన ఎంతో ఉపయోకరంగా ఉంటుందని మరో యూజర్ పేర్కొన్నాడు. ఈ మంచి విషయం వైరస్ కంటే వేగంగా పాకితే ఎంతోమంది ఆకలి తీరుతుందని తెలిపాడు.కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో అత్యధిక మరణాలు ఇటలీలోనే చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అక్కడ 1.15 లక్షల మంది వ్యాధికి గురికాగా.. 13,915 మంది చనిపోయారు. 18,278 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. శుక్రవారం నాటికి 83,049 మంది చికిత్స పొందుతుండగా 78,996 మంది నిలకడగా, 4,053 మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు ఇటలీ వెల్లడించింది. ఎంతో మంచి మనసు ఉన్న ఇటలీ ప్రజలకు ఈ కష్టం రావడం నిజంగా బాధకరమే కదూ. త్వరలోనే ఇటలీ కరోనా నుంచి కోలుకోవాలని కోరుకుందాం