YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 ఆక్వా విలవిల

 ఆక్వా విలవిల

 ఆక్వా విలవిల (పశ్చిమగోదావరి)
ఏలూరు, ఏప్రిల్ 04 (న్యూస్ పల్స్): జిల్లాకు ఆయువుపట్టు అయిన అక్వా సాగుపై కరోనా దెబ్బ బలంగానే పడింది. చెరువుల్లోని రొయ్యలు తేలిపోతుండటంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ఉండి మండలంలోని కలిగొట్ల, ఉండి, యండగండి, వాండ్రం గ్రామాలతోపాటు జిల్లాలోని గణపవరం, నిడమర్రు, ఉండి, ఆకివీడు, కాళ్ల, భీమవరం, మొగల్తూరు, నరసాపురం, అత్తిలి, పెనుమంట్ర, అత్తిలి, వీరవాసరం, భీమడోలు, ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు తదితర మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఆక్వా సాగు తీవ్ర ప్రతిబంధకాలను ఎదుర్కొంటోంది. ప్రధానంగా తెల్లమచ్చల వ్యాధి (వైట్‌ స్పాట్‌), విబ్రియోసిస్‌, వైట్‌గట్‌ వంటి వ్యాధులతో వందలాది ఎకరాల్లోని రొయ్యలు వివిధ ప్రాంతాల్లో దెబ్బతింటున్నాయి. వాటిని కాపాడుకునేందుకు ఆయా ప్రాంతాల్లోని రైతులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చెరువుల్లో పెరుగుతున్న వ్యాధులను అదుపులోకి తెచ్చేందుకు నిపుణులు సిఫార్సు చేసిన మందులు అత్యవసరంగా పిచికారి చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో దేశ మంతా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఆక్వా సాగు తీవ్ర ప్రతిబంధకాలు చవిచూస్తోంది. జిల్లాలో జనవరి నెలాఖరు నుంచి రొయ్యల పెంపకం విస్తీర్ణం బాగా పెరుగుతోంది. నేడు దాదాపు 60 వేల ఎకరాల్లో రొయ్యలు సాగవుతున్నట్లు అంచనా. వీటిలో అత్యధిక విస్తీర్ణంలో 80-100 కౌంట్‌ మధ్యలో రొయ్యలు పెరుగుతున్నాయి. 40-70 కౌంట్‌ మధ్యలో ఉన్న రొయ్య సుమారు 15 వేల ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో ఉండొచ్చని చెబుతున్నారు. వీటన్నింటినీ వివిధ రకాల వ్యాధులు తీవ్రంగా వేధిస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆక్వా ఉత్పత్తులు, మేతలు, మందుల కొనుగోళ్లు, ఎగుమతులకు ఎటువంటి ఆటంకాలు కలిగించొద్దని కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసినా అమల్లోకి వచ్చేసరికి అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు.  చెరువు లీజు, మూడు సెట్ల ఏరియేటర్లు, విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు, నీటితోడకంతో పాటు సీడ్‌ కొనుగోలుకు ఎకరానికి రూ.3 లక్షల వరకూ సాగు ప్రారంభంలోనే రైతు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఆ తర్వాత మేత, ఎరువులు, కూలీల ఖర్చు రూ.5 లక్షలకు మించి ఖర్చు చేయాల్సిందే. మూడు నెలలపాటు అన్ని రకాలుగా కాలం కలిసొస్తే 40 కౌంట్‌కి రొయ్యలు ఎదిగితే మూడున్నర టన్నుల వరకూ దిగుబడి లభిస్తుంది. పది రోజుల కిందటి వరకూ 40 కౌంట్‌ రొయ్య ధర జిల్లాలో రూ.350 నుంచి రూ.360ల వరకూ పలికింది. ఆ ప్రకారం దిగుబడి వచ్చినచోట ఎకరానికి రూ. 12.25 లక్షలు రైతు చేతికందాలి. పెట్టుబడి రూ. 8 లక్షలు, విద్యుత్తు బిల్లులు మరో రూ.లక్షన్నర పోనూ మిగిలిన 2.75 లక్షల ఆదాయం రైతు ఖాతాలో జమ కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ ప్రభావంతో అమ్మకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పట్టుబడులకు అవకాశం లేకుండా పోయింది. వైరస్‌, ఇతర వ్యాధుల ప్రభావంతో దెబ్బతిన్న రొయ్యలను కొనుగోలు చేసే నాథుడే కరవయ్యాడు. రెండు, రెండున్నర నెలల నుంచి పెంపకం దశలో ఉన్న రొయ్యలను మధ్యలో వదిలేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వమే అవసరమైన కోల్ట్‌స్టోరేజీలు ఏర్పాటుచేసి కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మేత, మందుల కొనుగోళ్లకు ఎటువంటి అవరోధాలు లేకుండా చూడాలని కోరుతున్నారు.

Related Posts