అమెరికాలో మరిన్ని మరణాలు
న్యూయార్క్, ఏప్రిల్ 6
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. ప్రతి రోజూ వేలకు వేల కేసులు బయటపడుతుండగా.. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో ప్రతి రెండున్నర నిమిషాలకు ఓ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. చాలా క్లిష్టమైన రోజులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ట్రంప్ పేర్కొన్నారు. ‘వచ్చే వారం రోజులు చాలా క్లిష్లమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా మరణాలు సంభవిస్తాయి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తు ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.అత్యంత ప్రభావిత రాష్ట్రాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చిన ట్రంప్... వైద్య సదుపాయాలు కల్పిస్తూ, మిలిటరీ సేవలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది సైనికులు, వైద్య నిపుణులు నిరంతరం పనిచేస్తున్నారని, న్యూయార్క్‌లో 1,000 మంది సైనికులను మోహరించారని తెలిపారు. అయితే, ఈస్టర్ రోజున సామాజిక దూరం నిబంధనలను సడలిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ‘మన దేశాన్ని మళ్లీ తెరవాల్సిన అవసరం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇప్పటి వరకూ 3.11 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడగా, దాదాపు 8,500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క శనివారమే 1,100 మంది మృతి చెందారు.కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగించే ఔషదాలు కచ్చితంగా ప్రభావం చూపుతాయని చెప్పలేమని, వైద్యులను సంప్రదించిన తరువాత వాటిని తీసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 30 వరకు సామాజిక దూరం నిబంధలు అమలవుతాయని ఇటీవల ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ విధించకుండానే వైరస్‌ను నిరోధించే చర్యలు కొనసాగిస్తామని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ట్రంప్ సూచించారు. అంతేకాదు, బయటకు వచ్చేటప్పుడు ఇంట్లో తయారుచేసుకున్న మాస్క్‌లను ధరించాలని, సర్జికల్ మాస్క్‌లను కరోనా బాధితులకు చికిత్స అందజేస్తున్న వైద్య సిబ్బందికి వదిలేయాలని పేర్కొన్నారు.కరోనా వైరస్ చికిత్సలో ప్రభావం చూపుతుందని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుల్ని తమకు అందించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. నేను ఈరోజు ఉదయం ప్రధాని మోదీతో మాట్లాడాను. వారు భారీ స్థాయిలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తయారు చేస్తున్నారు. అమెరికా కోరిన మేరకు ఔషధాల్ని అందించాలని కోరాం. భారత్ దీన్ని సీరియస్‌గా పరిశీలిస్తోంది. మార్చి 25న భారత ప్రభుత్వం హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతుల్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మానవతా దృక్పథంతో ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపునిచ్చింది.