ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఢిల్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని ఏపీ భవన్ లో జరిగిన ఈ భేటీలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల పట్ల కేంద్రం వైఖరి, విభజన హామీల అమలులో కేంద్రం తీరు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రాలపై కేంద్రం ఎలా పెత్తనం చేస్తోంది. ఏపీ రాష్ట్రం పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తోంది.విభజన సమయంలో ఇచ్చిన హామీలు, లుగు సంవత్సరాల కాలంలో హామీల అమలు, ఇతరత్రా అంశాలపై కేజ్రీవాల్ కు బాబు వివరణనిచ్చారు. ఈ భేటీ ముగిసిన అనంతరం టిడిపి ఎంపీ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లి సీఎం కేజ్రీవాల్ చంద్రబాబును కలిశారని, ప్రభుత్వంపై ఒత్తిడి ఎలా పెంచాలన్న అంశంపై చర్చించారని ఎంపీ సి.ఎం.రమేష్ అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హామీల అమలు కోసం ఏపీ రాష్ట్రం చేస్తున్న పోరాటానికి తాము మద్దతిస్తున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారని తెలిపారు. ప్రస్తుతం ఫ్రంట్ ఏర్పాట్లు ఏమీ చేయడం లేదని, ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రయత్నాలు చేయడం జరుగుతోందన్నారు.