ఏప్రిల్ 1న విడుదల
సహకార సంఘాల పదవీకాలం ఆరు నెలల పొడిగింపు
భావనపాడు పోర్టు అదానీకి..
ఇంటింటికి కుళాయి
ఆదరణ-2 పథకంలో 2.5లక్షల మంది చేతివృత్తుల వారికి పరికరాలు
రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుకు ఇవ్వాల్సిన రెండు డీఏల్లో ఒకటి ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి రూ.1100 కోట్లు వ్యయమవుతుంది. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి దీన్ని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో శనివారం సాయంత్రం మంత్రిమండలి సమావేశమైంది. మంత్రివర్గ నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశంలో వివరించారు.రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి రక్షిత నీరందించే లక్ష్యంతో వాటర్‌గ్రిడ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 13 జిల్లాల్లోని 36,884 ఆవాసాల్లో రూ.15,730కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుకు ఇవ్వాల్సిన రెండు డీఏల్లో ఒకటి ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి రూ.1100 కోట్లు వ్యయమవుతుంది. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి దీన్ని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి డీఏ విడుదలయ్యేలా చూస్తామని పేర్కొన్నారు.వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. రూ.9,400కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో పనులు చేపడతారు. ఈఅయిదు జిల్లాల్లోని 23,495 ఆవాసాల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రతి ఇంటికి 70లీటర్ల చొప్పున అందిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ.5,330కోట్లు నిధులు సేకరిస్తారు. ప్రభుత్వం రూ.1,000కోట్లు అందిస్తుంది. మొత్తం రూ.6,330 కోట్లతో 13,389 ఆవాసాల్లోని 38లక్షల కుటుంబాలకు తాగునీరందించాలన్నది లక్ష్యం. నిర్వహణను పొరుగుసేవల్లో చేపడతారు. వెనకబడిన తరగతులకు చెందిన 2.5లక్షల మంది చేతివృత్తిదారులకు ఆధునిక పరికరాలు అందించే ఆదరణ-2 పథకానికి మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ నుంచి దీన్ని ప్రారంభిస్తారు. అర్హులకు మూడు విభాగాల్లో రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ఇందులో 70శాతం రాయితీగా, 20శాతం రుణంగా ఇస్తుంది. 10శాతం లబ్ధిదారు వాటాగా ఉంటుంది. మొత్తం 124 వెనకబడిన తరగతుల వారు అధిక ఆదాయం సాధించేలా పథకాన్ని అమలు చేస్తారు. దీనికి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయింపులుంటాయి.సహకార సంఘాల పాలకమండళ్ల పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. వీటి పదవీకాలం జనవరి నెలాఖరు, ఫిబ్రవరి 3తో ముగుస్తుండగా 6 నెలల పాటు కొనసాగిస్తారు.శ్రీకాకుళం జిల్లా భావనపాడులో గ్రీన్‌ఫీల్డ్ నాన్‌మేజర్ పోర్టు అభివృద్ధిదారుగా అదాని పోర్ట్స్ సెజ్ సంస్థను ఎంపిక చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో దీన్ని ఏర్పాటు చేస్తారు.సొసైటీల్లో సభ్యులుగా లేని వారి నుంచి డిపాజిట్లు సేకరించడాన్ని నియంత్రించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ మూచ్యువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ 1995 చట్టానికి సవరణలు ప్రతిపాదించారు. ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.ఐటీ విధానంలో భాగంగా విశాఖపట్నంలో ఏర్పాటయ్యే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు ప్రత్యేక రాయితీలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రాష్ట్రం కోసం పని చేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి మేలు చేసేందుకు పూనుకున్నట్లు మంత్రిమండలి వెల్లడించింది. 50శాతం జీతాలు పెంపుదలకు ఆమోదం. జీవో నం.151 పరిధిలోకి రాని 484 మంది టెక్నికల్, నాన్‌టెక్నికల్ ఉద్యోగులకు ప్రయోజనం. ఖజానాపై ఏటా రూ.10.55కోట్లు అధిక భారం పడుతుంది.
ఏపీ ప్రైవేటు వర్సిటీ చట్టంలో చేర్పులు..
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాసంస్థలను నెలకొల్పేందుకు వీలుగా ఏపీ ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు, నియంత్రణ చట్టం-2016కు సవరణ చేసేందుకు ఆమోదం.తొలుత ఆర్డినెన్స్‌చేసి తర్వాతచట్టం చేస్తారు.
విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్..
విశాఖపట్నంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సముద్రతీరంలో అంతర్జాతీయ కన్వెన్షన్ కేంద్రం. లూలూ సంస్థ దీన్ని అభివృద్ధి చేస్తుంది. సీఎంఆర్ గ్రూపునకు చెందిన 3.4 ఎకరాల భూమిని మార్పు ప్రాతిపదికన సేకరించాలని నిర్ణయం.
పోస్టుల భర్తీ
* మాదకద్రవ్యాలు, కాపీరైట్స్, మాదకద్రవ్యాల నియంత్రణ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ఒక సబ్‌ఇన్స్‌పెక్టర్ పోస్టు, జిల్లాకు రెండు చొప్పున 26 కానిస్టేబుల్ పోస్టులు డిప్యుటేషన్ పద్ధతిలో భర్తీ.
* ఏపీ విద్యుత్తు పంపిణీ సంస్థకు ఇంజినీరింగ్, పర్సనల్-జనరల్, అకౌంట్స్, నిర్వహణ, సేవల(సర్వీస్) విభాగాలలో 406 నూతన పోస్టులు. వీటిల్లో ఏపీఎస్‌పీడీసీఎల్‌కు 240, ఏపీఈపీడీసీఎల్‌కు 166పోస్టులు కేటాయింపు.
* ఏపీ ట్రాన్స్‌కోలోని వివిధ విభాగాలకు 382 పోస్టులు.
* రాష్ట్రంలో కొత్తగా ముఖ్య సమాచార కమిషనర్, మూడు రాష్ట్ర సమాచార కమిషనర్ల పోస్టుల నియామకానికి జారీ చేసిన జీవో నం.122కు ఆమోదం.
* తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ పునరుద్ధరణ పనుల కోసం ఆరు సహాయ స్థపతి పోస్టుల మంజూరు.
ఇతర నిర్ణయాలు
* వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా విజయాబ్యాంకు నుంచి రైతు సాధికార సంస్థ తీసుకునే రుణానికి ప్రభుత్వ హామీ పొడిగింపు.
* ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి సంస్థ చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు బహిరంగ మార్కెట్లు/బ్యాంకుల నుంచి రూ.2 వేల కోట్ల అదనపు కాలపరిమితి రుణాన్ని సమీకరించేందుకు ఆమోదం.
* షెడ్యూల్డ్ కులాల, సఫారీ కర్మచారీల స్వయం ఉపాధి కోసం సంబంధిత జాతీయ ఆర్థికాభివృద్ధి సంస్థల తరఫున రూ.150 కోట్ల కేటాయింపు.
* రాజధాని అమరావతిలో సివిల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్ కోసం ఎకరా రూ.10 లక్షల ధరకు నాలుగు ఎకరాల భూమి కేటాయించాలని నిర్ణయం.
* రూ.3,306 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు. నిధుల సమీకరణ, నిర్వహణ బాధ్యత సీఆర్‌డీఏకు అప్పగింత.
* భూ సమీకరణ పద్ధతిలో సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్ల సేకరణకు నిర్ణయం.
* ప్రజావేదిక కార్యక్రమం కోసం సవరించిన అంచనాలతో రూ.295.38 కోట్లు మంజూరు.
* సామర్లకోటలో పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే నీటి రుసుంను కిలో లీటర్ రూ.30 నుంచి రూ.10కు తగ్గింపు.
* అమరావతి అభివృద్ధి దృష్ట్యా గుంటూరు పాత క్లబ్ రోడ్డులో గౌరంగ ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యంలో మల్టీప్లెక్స్‌తో కూడిన వాణిజ్య సముదాయ నిర్మాణానికి సడలింపులు.
* ఒంగోలు ట్రిపుల్ ఐటీ పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ట్రిపుల్ ఐటీగా మార్పు.
* ఎల్‌వీ ప్రసాద్ నేత్ర ఇనిస్టిట్యూట్ పేరును హైదరాబాద్ నేత్ర సంస్థగా మార్పు.
* అమరావతిలో 6.84 చదరపు కిలో మీటర్ల స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం ఇక నుంచి సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్‌తో ఒప్పందాలు చేసుకోవాలని తీర్మానం.