YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జగన్ కోరికల చిట్టా

జగన్ కోరికల చిట్టా

జగన్ కోరికల చిట్టా
విజయవాడ, ఏప్రిల్ 8, 
ఎందుకో కానీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగానే ఉన్నట్లుగానే ప్రస్తుత పొలిటికల్ సీన్ చూస్తూంటే కనిపిస్తోంది. లేకపోతే ఓ వైపు రాజకీయ గండరగండడు చంద్రబాబు పితూరీలు, మరో వైపు కొత్త నేస్తం పవన్ కళ్యాణ్ చెలరేగిపోవడాలు, ఇంకో వైపు ఏకంగా సొంత పార్టీ తరఫున కన్నా లక్షీనారాయణ లాంటి వారే జగన్ మీద దారుణమైన విమర్శలు చేస్తున్న వైనం కంటికి కనబడుతోంది. అయినా సరే ప్రధాని మోడీ జగన్ కి ఫోన్ చేస్తున్నారు. ఆయన చెప్పినది వింటున్నారు. తనకు తోచిన తక్షణ సాయం ఏపీకి ప్రకటిస్తున్నారు. నిజంగా చెప్పుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలో జరగలేదు. కానీ ప్రధాని పెద్ద మనసు చేసుకుని 14వ ఆర్ధిక సంఘం ద్వారా రావాల్సిన అయిదు వేల కోట్ల రూపాయలలో మొదటి దఫాగా 1300 కోట్ల రూపాయలు సరిగ్గా లాక్ డౌన్ కి రెండు రోజుల ముందు విడుదల చేసి అతి పెద్ద ఉపశమనం కలిగించారు. ఆ తరువాత కూడా మరో 1100 కోట్లు ఏపీకి కరోనా పేరిట ఆర్ధిక సాయంగా ఇచ్చారు.
ఇక ఏపీలో ఎపుడైతే కరోనా వీర విహారం చేసిందో నాటి నుంచే జగన్ ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో కేంద్రానికి ఈ సరికే ఒక లేఖ రాశారు. భారీ ఎత్తున సాయం చేసి ఆదుకోవాలని అందులో అర్ధించారు. ఇక ప్రధాని అందరు ముఖ్యమంత్రులతో పెట్టిన వీడియో కాన్ఫరెన్స్ లో సైతం మోడీ ముందు జగన్ అడిగింది ఆర్ధికంగా ఆదుకోమనే. అటువంటిది ఇపుడు జగన్ కి నేరుగా ప్రధాని ఫోన్ చేశారు. ఆ సమయంలో కూడా జగన్ కరోనా కేసుల సంగతి పెరగకుండా కట్టడి చేస్తున్నట్లు చెప్పుకొస్తూనే భారీ ఎత్తున నిధులు మంజూరు చేయాలంటూ మళ్ళీ స్వయంగా మోడీని విన్నపం చేసుకున్నారు.ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.2,100 కోట్లు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి రూ.2,200 కోట్లు.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు రూ.1,100 కోట్లు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.1,050 కోట్లు, జీఎస్టీ పరిహారం కింద రూ.900 కోట్లు ఇప్పించాల్సిందిగా ప్రధానిని జగన్‌ కోరారు. సాధ్యమైనంత త్వరగా వీటిని ఇప్పించి ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రధానిని జగన్ వేడుకున్నారు.ఇక ప్రధాని సైతం జగన్ కోరికల పట్ల సానుకూలత చూపడమే అసలైన విశేషం. జగన్ అడిగిన దానికి ప్రధాని సానుకూలంగా స్పందిస్తూ లేఖలోని అంశాలు తన దృష్టికి వచ్చాయని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారట. నిజంగానే వీటన్నిటికి మోడీ సానుకూలంగా స్పందించి వీటిలో అధికభాగం నిదులు ఇస్తే ఏపీకి, ,అలాగే ముఖ్యమంత్రి జగన్ కు పెద్ద ఉపశమనమే అవుతుంది. మరి జగన్ పట్ల, ఆయన పాలనా తీరు పట్ల ప్రధాని మోడీ బాగానే మార్కులు వేస్తున్నట్లుగా గత పది నెలల ఆయన తీరు చెబుతోంది. జగన్ కూడా మోడీ ఎలా చెబితే అలా అన్నట్లుగా ఉంటూ రావడంతో ఇపుడు మోదీ, జగన్ ల బంధం గట్టిపడుతోంది. దాంతో ఏపీకి కేంద్రం సాయం చేస్తుందన్న ఆశలు వైసీపీ సర్కార్ పెద్దల్లో కలుగుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related Posts