YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

నిత్యవసర వస్తువులతో మద్యం స్మగ్లింగ్

నిత్యవసర వస్తువులతో మద్యం స్మగ్లింగ్

నిత్యవసర వస్తువులతో మద్యం స్మగ్లింగ్
అనంతపురం, ఏప్రిల్ 8
లాక్‌డౌన్‌ నేపథ్యంలో నకిలీ మద్యం కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి సరఫరా అవుతోంది. ప్రధానంగా నిత్యావసర సరుకుల వాహనాలను అనుమతిస్తుండటంతో అక్రమ మద్యం వ్యాపారులు దీనిని ఆసరాగా చేసుకున్నారు. టమాట లోడులో నకిలీ మద్యం కేసులను పెట్టుకుని మరీ అనంతపురం జిల్లాలోకి తీసుకువస్తున్నారు. బెంగళూరులోని ఒక డెన్‌లో ఈ అక్రమ మద్యాన్ని పక్కాగా బాటిలింగ్‌తో పాటు ప్యాకింగ్‌ చేసి కేసుల రూపంలో సరఫరా చేస్తున్నారు. బెంగళూరు నుంచి నిత్యావసర సరుకుల వాహనాల్లో జిల్లాకు తీసుకువచ్చి మద్యం ప్రియులకు విక్రయిస్తున్నారు. జిల్లాకు చెందిన నకిలీ మద్యం వ్యాపారి హరినాథ్‌ గౌడ్‌ బెంగళూరులోని డెన్‌ నిర్వాహకులతో సంబంధాలు పెట్టుకుని అక్రమ మద్యాన్ని యథేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నాడు. వ్యవహారంలో ఎక్సైజ్‌ సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా నకిలీ మద్యం విక్రయంలో ఎక్సైజ్‌ సిబ్బందితో పాటు ప్రభుత్వ మద్యం షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేసిన వారు కూడా సహకరిస్తున్నారు. ఒక్కో క్వాటర్‌ బాటిల్‌ను రూ.400 నుంచి రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్సైజ్‌ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేయగా బండారం బట్టబయలైంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పెనుకొండ స్టేషన్‌లో పనిచేస్తున్న ముగ్గురు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లను ఇప్పటికే సస్పెండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల మధ్య రాకపోకలను నిలిపివేశారు. అంతేకాకుండా జిల్లాల మధ్య కూడా రవాణాను స్తంభింపజేశారు. అత్యవసర వాహనాలు, నిత్యావసర సరుకుల వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అక్రమ మద్యం వ్యాపారులు ఆసరాగా చేసుకున్నారు. ప్రధానంగా టమాట లోడులో మద్యం కేసులను తీసుకుని కర్ణాటక నుంచి జిల్లాలోకి రవాణా చేస్తున్నారు. ఈ విధంగా ప్రవేశించిన తర్వాత కార్లలో ఒకటి రెండు కేసులు పెట్టుకొని గుట్టుగా విక్రయాలు సాగిస్తున్నారు.  వాస్తవానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. దీంతో మందుబాబులు మద్యం కొరతతో అల్లాడుతున్నారు. దీనిని అక్రమ వ్యాపారులు కాస్తా తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ప్రధానంగా గోవా నుంచి తీసుకువచ్చిన స్పిరిట్‌లో రంగునీళ్లను కలుపుతున్నారు. ఈ రంగునీళ్లను కాస్తా పక్కాగా బాటిళ్లలో నింపి లేబుళ్లను కూడా వేస్తున్నారు. ఈ మద్యం బాటిళ్లకు లేబులింగ్‌లో పాండిచ్చేరిలో తయారు చేసినట్టు ప్యాకింగ్‌ చేస్తున్నారు. దీనిపై పక్కా సమాచారంతో ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు దాడి చేయడంతో గుట్టు రట్టయింది. ఇదిలాఉంటే జిల్లా కేంద్రం అనంతపురంలోనూ పలువురు మద్యం వ్యాపారులు గుట్టుగా మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం. వెయ్యి రూపాయల విలువ కూడా చేయని మద్యం బాటిళ్లను ఏకంగా రూ.3వేల నుంచి రూ.4వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది.

Related Posts