13 కరోనా ఆస్పత్రులు
నెల్లూరు, ఏప్రిల్ 8,
కరోనా నియంత్రణ కోసం అనేక చర్యలు చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరింత సమర్థవంతంగా వైరస్‌ను ఎదుర్కొనేందుకు భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పక్కా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ టెస్టింగ్ పరికరాలు, బెడ్లు, మందులు, సిబ్బందిని పెద్ద ఎత్తున సిద్ధం చేసింది. రాష్ట్రంలో 4 కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులను గుర్తించింది. రాష్ట్రస్థాయి ఆస్పత్రులలో 444 ఐసీయూ బెడ్లు, 1,680 నాన్ ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 284 ఐసీయూ, 1,370 నాన్ ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉన్నాయి.13 జిల్లా కోవిడ్ ఆస్పత్రులలో 650 ఐసీయూ, 8950 నాన్ ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 334 ఐసీయూ, 6,662 నాన్ ఐసీయూ బెడ్లను సిద్ధం చేసింది. రాష్ట్ర స్థాయిలోని ఒక్కో ఆస్పత్రిలో 100కు పైగా ఐసీయూ కెపాసిటీ, స్పెషలిస్టు డాక్టర్లు ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి ఆస్పత్రులలో 648 స్పెషలిస్ట్ డాక్టర్లు, 792 పీజీ డాక్టర్లు, 792 హౌస్ సర్జన్లు, 1152 నర్సింగ్ సిబ్బందిని సిద్ధం చేసింది. జిల్లా కోవిడ్ ఆస్పత్రుల్లో 546 స్పెషలిస్ట్ డాక్టర్లు, 546 పీజీ డాక్టర్లు, 273 హౌస్ సర్జన్లు, 546 నర్సింగ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. వారం పాటు పనిచేసే సిబ్బందికి 14 రోజులు సెలవు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వైద్య సిబ్బందికి ఎన్ 95 మాస్క్‌లు, పీపీఈలు అందుబాటులో ఉంచింది.