ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు బుధవారం నాడు భేటీ అయ్యారు. సమావేశానికి చలసాని శ్రీనివాస్, తాడి నరేష్, కొండా నర్సింగరావు, సదాశివరెడ్డి, అప్పలనాయుడు, మల్లికార్జున్ ఇతరులు హజరయ్యారు. ఈ సందర్బంగా జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. మొదటి నుంచి మీరు ఒకే మాటపై నిలబడి, ప్రత్యేక హోదాను సజీ వంగా ఉంచారని అన్నారు. అన్ని రాజకీయ పక్షాలు, సంఘాలను కలుపుకొని హోదా పోరాటానికి నాయకత్వం వహించాలని వారు జగన్ ను కోరారు. ఢిల్లీ వెళ్లి ఆమరణ దీక్షలో పాల్గొనే ఎంపీలకు సంఘీభావం తెలుపుతామని వైఎస్ జగన్కు చెప్పారు. జగన్ మాట్లాడుతూ హోదాపై ఇప్పటికే కార్యాచరణ ప్రకటించాం త్వరలో మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని అన్నారు. చంద్రబాబు కేంద్రాన్ని అడగకపోవడం వల్లే హోదా రాలేదు. ఒక వేళ చంద్రబాబు అడిగిఉంటే హోదా వచ్చేదని అయన అన్నారు. ప్రత్యేక హోదాకు కేబినెట్ ఎప్పుడో ఆమోదం తెలిపింది. ప్లానింగ్ కమిషన్ను చంద్రబాబు కలిస్తే హోదా వచ్చేదని అయన అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లింది హోదా కోసం కాదు. ప్రజలను మరోసారి మభ్యపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని జగన్ విమర్శించారు. హోదా కోసం పోరాడే వారందరికీ వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుంది. హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని జగన్ డిమాండ్ చేసారు.