జనసేన అధినేత పవన్కల్యాణ్తో వామపక్ష పార్టీల నేతలు బుధవారం సమావేశం అయ్యారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమరణదీక్ష చేపట్టడంపై వామపక్ష నేతలతో పవన్కల్యాణ్ చర్చించారు. జేఎఫ్సీ నివేదిక, ఢిల్లీ పరిణామాలపై కూడా వీరు చర్చించారు. తరువాత పవన్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకపోవడం దారుణమని అన్నారు. సభా సజావుగా జరిగేలా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యతలను విస్మరించిందని అన్నారు. ఈ నెల 6న ఏపీలో పాదయాత్ర చేస్తామని, ముఖ్యంగా జాతీయ రహదారుల్లో, పలు ముఖ్య కూడళ్లలో నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. పూర్తి శాంతియుత పద్ధతిలో ఢిల్లీకి తాకే విధంగా నిరసన ఉంటుందని అన్నారు. టీడీపీ, వైసీపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుండా పరస్పరం నిందలు వేసుకుంటున్నాయని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని పవన్ ఆరోపించారు.
సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమస్య ప్రస్తుతం జాతీయ సమస్యగా మారి పార్లమెంటు ఒక సెషన్ మొత్తం ఎపి సమస్యతో అట్టుడికిపోతోందని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇస్తే ప్రధాని మోడీ కనీసం పది నిముషాల సమయం కేటాయించి సభ్యులతో మాట్లాడలేదన్నారు. ఇంతకంటే ప్రజాస్వామ్యానికి అవమానం లేదని అయన మండిపడ్డారు. సీపీఎం కార్యదర్శి మధు మాట్లాడుతూ కేంద్రం ఏపీ ప్రజలను చేతగాని వాళ్లలా చూస్తోందని మధు అన్నారు..పరస్పర విమర్శలతో తెలుగుదేశం, వైకాపాలు హస్తిన వేదికగా తెలుగువారి పరువు తీస్తున్నారని ఆయన విమర్శించారు.