విలవిల (పశ్చిమగోదావరి)
ఏలూరు, ఏప్రిల్ 08 (న్యూస్ పల్స్): కరోనా వైరస్ ప్రభావంతో జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 100 నుంచి 40 కౌంట్‌కొచ్చిన రొయ్యలను మార్కెట్‌లో సాఫీగా విక్రయించుకునే పరిస్థితులు దాదాపు కన్పించడం లేదు. రూ.వందల కోట్ల విలువైన రొయ్యలు పట్టుబడికొచ్చాయి. ఈహెచ్పీ, వైట్గట్, ఈహెచ్పీ వంటి వ్యాధులు రొయ్యల సాగుకు ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయి. ప్రభుత్వం ఇచ్చిన సడలింపుతో మార్కెట్‌లో మందులు లభిస్తుండటంతో ఆ వ్యాధుల నివారణకు రైతులు చర్యలు తీసుకుంటున్నారు. తెల్ల మచ్చల వ్యాధి, ఆక్సిజన్ లోటు తలెత్తిన చోట్ల హడావుడిగా రొయ్యల పట్టుబడి చేయాల్సిందే. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ సరకును విక్రయించుకోగలిగితే రైతు ఎంతో కొంత గట్టెక్కుతాడు. లేకుంటే పెట్టుబడి గంగపాలే. ఇప్పుడదే జరుగుతోంది. కొన్ని రోజుల నుంచి రొయ్యల్లో తెల్లమచ్చల వ్యాధి విజృంభిస్తోంది. ఒక చెరువుకు సోకితే ఆ ప్రాంతంలోని చెరువులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే. జిల్లాలో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాలకు రొయ్యల ఎగుమతులు అత్యధిక శాతం నిలిచిపోయాయి. ఆ ప్రభావం కొనుగోళ్లపై తీవ్రంగా పడింది. పట్టుబడికొచ్చిన రొయ్యల విక్రయానికి ముందుకొస్తున్న రైతుకు మార్కెట్‌లో అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్లాంట్లలో రొయ్య తల ఒలిచే కూలీల కొరత నెలకొంది. రొయ్య తల తీసి ఇస్తే కొనుగోలు చేస్తామని కమీషన్‌దారులు స్పష్టంచేస్తున్నారు. వైరస్ భయంతో కూలీలు ముందుకు రావడం లేదు. అదనపు పెట్టుబడి పెట్టి రొయ్యలు ఒలిచి ఇచ్చినా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ధర చెల్లించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అవసరాన్ని కమీషన్‌దారులు సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఎగుమతులు వెళ్తే కొనుగోళ్లు సాఫీగా జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారుజిల్లాలో రొయ్యల చెరువుల విస్తీర్ణం సుమారు 80 వేల ఎకరాలుగా ఉంది. పట్టుబడికొచ్చిన చెరువులు సుమారు 16 వేల ఎకరాలుండగా.. ఎకరానికి సగటు రొయ్యల దిగుబడి దాదాపు 2 టన్నులుగా నమోదవుతోంది. సుమారు 32 వేల టన్నుల రొయ్యలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. 80-40 కౌంట్ మధ్య ఉన్న రొయ్యలు దాదాపు 16 వేల టన్నులు ఉన్నాయి.