కమలాపూర్ రేయాన్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై 15 రోజుల్లో స్పష్టత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆ కంపెనీ సీ.ఈ.ఓ, ప్రతినిధులను ఆదేశించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరించే ఆలోచన ఉంటే రెండు నెలల్లో పూర్తి ప్రాజెక్టును సమర్పించాలన్నారు. కానీ ఇంకా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నెల రోజుల్లో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన వేతన బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. రానున్న పదిహేను రోజుల్లో తాను, మంత్రి చందూలాల్, ఇతర నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి రేయాన్ యాజమాన్యంతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చాంబర్ లో గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు రేయాన్ ఫ్యాక్టరీ యూనియన్ ప్రతినిధులు, రేయాన్ కంపెనీ సీఈవో నిహార్ అగర్వాల్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వై. కేశవరెడ్డి,లేబర్ కమిషనర్ అహ్మద్ నదీమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.