3 లక్షల మాస్క్ లు తయారు చేస్తున్న స్వయం సహాయక సంఘాలు
వరంగల్, ఏప్రిల్ 9
కరోనా వైరస్ పరిస్థితుల నేపధ్యంలో మున్సిపల్ ఉద్యోగులు, పారిశుద్య సిబ్బంది, పోలీసుల రక్షణ కోసం పెద్ద ఎత్తున మాస్క్‌ల తయారీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక మహిళా సంఘాల(ఎస్‌హెచ్‌జి)లకు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్‌ల వినియోగం పెరగడం వల్ల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌గారి పర్యవేక్షణలో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ రెండు రోజులుగా పలు దఫాలుగా మున్సిపల్ కమిషనర్లు, మెప్మా మిషన్ కోఆర్డినేటర్లతో జూమ్ టెక్నాలజీ వినియోగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ప్రస్తుత లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి సామాజిక దూరం( సోషల్ డిస్టెన్సీని) పాటించడంలో భాగంగా కొత్త టెక్నాలజీ(జూమ్ యాప్) ఉపయోగించి అధికారులు వారి ఇంటి నుంచే మొబైల్ ఫోన్ లేదా? కంప్యూటర్ వెబ్ కెమెరా ద్వారా 300మంది అధికారులతో(కమిషనర్లు, మెప్మా అధికారులు)లతో డైరెక్టర్ సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్లు వేణుగోపాల్‌రెడ్డి, ఫల్గున్ కుమార్, మెప్మా స్టేట్ మిషన్ కో-ఆర్డినేటర్ జి.పద్మలు మాట్లాడారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయ సంఘాల మహిళలు ఇంటి వద్దే తమ వద్ద ఉన్న కుట్టు మిషిన్ల ద్వారా యుద్ద ప్రాతిపదికన దాదాపు మూడు లక్షల మాస్క్‌ల తయారీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.మహిళా సంఘాలు తయారు చేసి ఇచ్చే మాస్క్‌లను ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న 139 స్థానిక మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు(జిహెచ్‌ఎంసి మినహా) కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఒక్కొక్క మాస్క్ తయారీకి అయ్యే ఖర్చును కనిష్టంగా రూ.10లు, గరిష్టంగా రూ.14ల చొప్పున కొనుగోలు చేసేందుకు మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ పరిపాలన అనుమతులు ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో అన్ని మున్సిపాలిటీల పరిధిలో విధులు నిర్వహించే మున్సిపల్ సిబ్బంది, పోలీసులు సిబ్బంది, వీధి విక్రయదారులు(స్ట్రీట్ వెండర్స్) ఎవ్వరూ కూడా మాస్క్ ధరించకుండా తిరగడానికి వీలులేదని డైరెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు.