నగరంలోని గేటెడ్ కమ్యునిటి కాలనీల్లో ఈ నెలాఖరు వరకు సేంద్రియ ఎరువుల తయారీ గుంతలను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ఇళ్లలోనూ స్వయంగా కంపోస్ట్ ఎరువుల తయారీని ప్రారంభించేలా చర్యలను చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్లు, ట్రాన్స్‌పోర్ట్స్ ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్‌హించారు. అడిషనల్ కమిషనర్లు శృతి ఓజా, రవికిరణ్, భాస్కరాచారి, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్‌కంపాటిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడానికి ప్రాధాన్యత ఇస్తూనే ఇంట్లోనే ప్రత్యేకంగా కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యునిటి కాలనీల లక్ష్యంగా కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటును వంద శాతం చేపట్టాలని మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేరుచేసేవారికి లాటరీ ద్వారా లక్ష రూపాయలు అందించేందుకు ఉద్దేశించిన స్వచ్ఛదూత్ యాప్‌ను దాదాపు 10లక్షల మంది డౌన్‌లోడ్ చేసేందుకు ఎస్.ఎఫ్.ఏలు, శానిటేషన్ వర్కర్లు ఇతర సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. నగరంలో తడి, పొడి చెత్త వేరు చేయడంతో పాటు చెత్తను స్వచ్ఛ ఆటోలకు ఇవ్వడానికి చైతన్య పర్చేందుకు నియమించిన 2,173 స్వచ్ఛ దూత్ మహిళా కార్యకర్తల పనితీరును సమీక్షించాలని పేర్కొన్నారు. కొత్తగా మంజూరు చేసిన 500స్వచ్ఛ ఆటోలను 150ఆటోలను లబ్దిదారులకు అందించడం జరిగిందని, మిగిలిన 350స్వచ్ఛ ఆటోల పంపిణీని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ ఆటోల పంపిణీ అనంతరం ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి వాటి ద్వారా భవన నిర్మాణ ముడి పదార్థాలను తయారుచేసే ప్లాంట్‌రను ఏర్పాటు చేసిన 4వ నగరంగా హైదరాబాద్ నిలిచిందని పేర్కొన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నిర్మాణ వ్యర్థాలను సేకరించేందుకుగాను ప్రతి సర్కిల్‌కు ప్రత్యేకంగా డి.ఇ.ఇను నియమించడం జరిగిందని, ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేసి భవన నిర్మాణ వ్యర్థాలను పకడ్బందీగా తొలగించాలని కమిషనర్ తెలియజేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 43స్వీపింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయని, ఈ యంత్రాలు స్వీపింగ్ చేసే మార్గాల్లో పారిశుధ్య కార్మికులను ఇతర ప్రాంతాలకు కేటాయించాలని అన్నారు. ప్రతినెల మెడికల్ ఆఫీసర్లు స్వియనిర్థారణ సమీక్ష చేపట్టాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతినెల ఉత్తమ హోటళ్లు, కాలనీ సంక్షేమ సంఘాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్లకు ప్రత్యేక పురస్కారాలు అందించే ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని అన్నారు.