పోలండ్‌లో సినిమా షూటింగులపై ఆ దేశ రాయబారితో పవన్ కల్యాణ్
దక్షిణాది సినీ ఇండస్ట్రీ పోలండ్‌లో షూటింగులు జరుపుకొనేలా ప్రయత్నిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కొందరికి దక్షిణాది అంటే చిన్నచూపు ఉందని, కానీ, దక్షిణాది సామర్థ్యం చాలా మందికి తెలియదని అన్నారు.ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్‌తో పోలండ్ రాయబారి ఆడమ్ బురకోవస్కీ సమావేశమయ్యారు.పోలండ్ ఫిల్స్ కౌన్సిల్‌తో ఓ సారి వర్క్ షాప్ నిర్వహించేందుకు కృషి చేయాలని, తద్వారా దక్షిణాది సినిమా ఇండస్ట్రీ పోలండ్‌కు వచ్చేలా తనవంతు సహకారం అందిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పోలండ్ రాయబారి తనను కలవడానికి రావడం సంతోషకరమని, అది తనకు దక్కిన గౌరవమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
పోలండ్, భారత విద్యార్థులతో ఇలా కలిసి మాట్లాడడం చాలా సంతోషాన్నిచ్చే విషయమన్నారు. ఓ నటుడిగా కాకుండా ఇరుదేశాల సంస్కృతిని పరస్పరం గౌరవించుకునేలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. వివిధ సంస్కృతుల సమ్మేళనాలైన దేశాల మధ్య మైత్రి సంబంధాలు పెంపొందాలంటే పరస్పరం గౌరవించుకోవాలన్నారు. తన భార్య రష్యాకు చెందిన వ్యక్తి అని, తద్వారా వారి సంస్కృతి గురించి తెలిసిందని పవన్ అన్నారు.పవన్ కల్యాణ్‌తో అనేక విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నానని, కానీ, ప్రస్తుతం మాత్రం ప్రత్యేకంగా ఇరుదేశాల మధ్య సినిమా సహకారం గురించే చర్చించాలనుకుంటున్నానని పోలండ్ రాయబారి బురకోవస్కీ అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఓ సారి పోలండ్ గురించి ఆలోచించాలని కోరారు. తెలుగు సినిమాలను పోలండ్‌లో షూట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సముద్రం, సరస్సులు, కొండలు, గుట్టలు, అందమైన నగరాలతో తమ దేశం అందంగా ఉంటుందని, సినిమా షూటింగులకు సరిపోయే వాతావరణం ఆహ్లాదం పంచుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే పలు సినిమాలను పోలండ్‌లో చిత్రీకరించారని, ఫనా, కిక్ వంటి చిత్రాలను షూట్ చేశారని చెప్పారు. అయితే, ఇప్పటిదాకా పోలండ్‌లో హిందీ చిత్రాలను మాత్రమే షూట్ చేశారని, తెలుగు చిత్ర సీమకు కూడా షూటింగులకు ఆహ్వానం ఇస్తున్నామని ఆయన అన్నారు. అయితే, ఆయన విజ్ఞప్తి మేరకు పవన్ కల్యాణ్.స్పందించారు.పోలండ్ రాయబారి తనను కలవడానికి రావడం సంతోషకరమని, అది తనకు దక్కిన గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు.