వైరస్‌తో రాజకీయాలు చేయడం మానుకోవాలి: ప్రపంచ ఆరోగ్య సంస్థ
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 9
వైరస్‌తో రాజకీయాలు చేయడం మానుకోవాలని, మీ ప్రజల క్షేమం గురించి మీరు ఆలోచిస్తే, అప్పుడు పార్టీలు, ఐడియాలజీలకు అతీతంగా పనిచేయాలని, ఇది రాజకీయ పార్టీలకు ఇస్తున్న సందేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ డాక్టర్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. నోవెల్ కరోనా వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శలు చేసిన నేపథ్యంలో.. టెడ్రస్ మీడియాతో మాట్లాడారు. కరోనాపై పోరాటంలో భాగంగా ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చైనాలో వైరస్ ప్రబలుతున్న విషయాన్ని తాము ముందుగానే చెప్పామని, గురువారంతో ఆ విషయాన్ని వెల్లడించి వంద రోజులు పూర్తి అవుతుందని టెడ్రోస్ అన్నారు. చైనాతో చాలా సన్నిహితంగా డబ్ల్యూహెచ్‌వో ఉంటోందని ట్రంప్ ఆరోపించారు. మా దగ్గర డబ్బులు తీసుకుని, చైనాకు చేరువవుతోందని ట్రంప్ విమర్శించారు. ఆ వ్యాఖ్యలను టెడ్రోస్ కొట్టిపారేశారు.నిందారోపణలు విడిచిపెట్టి కరోనా వైరస్‌ఫై పోరాటంలో చైనాతో కలిసి పనిచేయాలని అమెరికాను టెడ్రోస్ కోరారు. డబ్ల్యూహెచ్‌వో మేనేజ్‌మెంట్‌ను ఆయన సమర్థించుకున్నారు. ఈ ప్రమాదకరమైన శత్రవుపై యుద్ధం చేయాలంటే అమెరికా, చైనా ఒకటి కావాలన్నారు. జెనివాలో జరిగిన మీడియా సమావేశంలో టెడ్రెస్ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలను కాపాడే అంశంపైనే రాజకీయ పార్టీల ఫోకస్ మొత్తం ఉండాలన్నారు. వైరస్‌ను రాజకీయం చేయవద్దు అన్నారు. ఇక జనం చావకూడదు అని మీరనుకుంటే, వైరస్‌పై వెంటనే రాజకీయ ఆరోపణలు మానేయాలని ట్రెడెస్ తెలిపారు. నిప్పుతో చెలగాటం ఆడటం మంచికాదన్నారు. మరణాల సంఖ్యను ప్రస్తావించిన ఆయన.. ఇది సరిపోదా అన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.