అమెరికా కరోనా మృతుల్లో 11 మంది భారతీయులు
వాషింగ్టన్ ఏప్రిల్ 9
ప్రాణాంతక కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఆ దేశంలో ఈ మహమ్మారి బారినపడి ఇప్పటికే 14 వేలమందికిపైగా మృతి చెందారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 2 వేల మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో ఉన్న భారతీయులపై కూడా కరోనా ఎఫెక్ట్ తీవ్రంగానే ఉన్నది. లాక్‌డౌన్ కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఎంతో మంది భారతీయులు అమెరికాలోనే ఉండిపోయారు. అయితే అక్కడ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారతీయుల్లో కూడా చాలామంది ఆ మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటివరకు 11 మంది భారతీయులు కరోనాతో చనిపోయినట్లు సమాచారం. వీరిలో 10 మంది న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలకి చెందిన వారు కాగా, ఒక్కరు ఫ్లోరిడాలో నివాసం ఉంటన్న వ్యక్తిగా అధికారులు గుర్తించారు. మృతుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లని తెలిసింది. ఇదిలావుంటే నలుగురు మహిళలు సహా మరో 16 మంది భారతీయులు కరోనా లక్షణాలతో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది న్యూయార్క్‌లో, ముగ్గురు న్యూజెర్సీలో, మిగిలినవారు టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఉన్నారు. వారంతా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు.