YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ దాహం తీరనిది..

ఈ దాహం తీరనిది..

పుత్తూరు పట్టణానికి మంచినీటి సమస్య ఇప్పట్లో తీరేలా లేదు. నిరుడు వర్షాలు లేకపోవడంతో ఈ యేడు పుత్తూరు పట్టణంలో తాగునీటికి కటకటలాడే పరిస్థితి కన్పిస్తోంది. పదేళ్ల కిందట.. 2005లోనూ తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్న సందర్భంలో తాగునీటి ప్రాజెక్టుల కోసం పుత్తూరు మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేయాలంటూ ప్రజారోగ్యశాఖ అధికారులు నాటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2007లో ‘సుస్థిర తాగునీటి పథకం’ కింద కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మున్సిపాలిటీకి రూ.56 కోట్ల నిధులు మంజూరు  చేసింది. గాలేరు-నగరి కాలువ నుంచి నీటిని తీసుకునేలా వేసవి జలాశయానికి రూపకల్పన చేశారు. పుత్తూరు శివారులోని చెరువులో ట్యాంకు నిర్మించాలని తలచారు. 96 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు సాగునీటి పారుదలశాఖ అధికారుల వద్ద అనుమతులు తీసుకున్నారు. 2008లో పనులు ప్రారంభించారు. 2010 నాటికి పూర్తి చేసి తాగునీరు అందించాలన్నది లక్ష్యం.

పథకం పూర్తి అయినా ఇప్పటి వరకు గుక్కెడు నీటిని కూడా ప్రజలకు అందించిన దాఖలాల్లేవు. నీళ్లు రావని తెలిసినా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు  ఒక్కో మోటారుకు రూ.10లక్షలు వ్యయం చేసి నాలుగు మోటార్లు బిగించారు. అవి నేడు వాడకుండానే తుప్పు పడుతున్నాయి. దీనికి తోడు ఊరంతా వేసిన తాగునీటి పైపులైన్లు దెబ్బతింటున్నాయి. పున్నమి హోటల్‌, ఆర్టీసీ కాలనీ, చిన్నరాజుకుప్పం వద్ద సమ్మర్‌ స్టోరేజ్‌ ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసి తాగునీటి అందించేందుకు ట్యాంకులు నిర్మించారు. అవి కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒకవేళ వాటిలో నీళ్లు నింపకపోతే అవీ దెబ్బతినే ప్రమాదముంది. ఓ రకంగా చెప్పాలంటే.. రూ.56 కోట్ల నిధులు మట్టి పాలయ్యాయి. ఏడాది క్రితం మరో రూ.కోటి నిధులు వ్యయం చేసి చెరువులోకి వచ్చే నీటిని ఎస్‌ఎస్‌ ట్యాంకులోకి పంపింగ్‌ చేసేందుకు సంప్‌ ఏర్పాటు చేశారు. గత సంవత్సరం వర్షాలు లేకపోవడంతో ఆ ప్రయత్నమూ ఫలించలేదు.

పుత్తూరు పట్టణ జనాభా 56వేల మంది ఉన్నారు. పుత్తూరు విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందుతుండంతో నిత్యం పట్టణానికి 20 నుంచి 30వేల మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వారందరికి తాగునీరు అందించడం మున్సిపాలిటీ కనీస బాధ్యత. నేడు రెండు రోజులకొకసారి తాగునీటిని అందిస్తున్నారు. ఏప్రిల్‌, మే మాసాల్లో తాగునీటి సరఫరా పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని అధికారులే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం అందించే వాటాకు మున్సిపాలిటీ తన వాటా కింద 10శాతం చెల్లించాలి. మున్సిపాలిటీ ఇప్పటి వరకు తన వాటాను చెల్లించలేదు. భవిష్యత్తులో మున్సిపాలిటీకి కేంద్రం నుంచి వచ్చే వాటా నుంచి మినహాయించుకుని ఇచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు జలాశయం నిర్వహణ మున్సిపాలిటీకి భారంగా పరిణమించనుంది.

గాలేరు-నగరి ప్రాజెక్టును రూపొందించారు. మొదటగా కాలువలు పూర్తి చేశాక రిజర్వాయర్లు పనులు చేయడం పద్ధతి.. లేదంటే రెండు పనులూ ఒకేసారి ప్రారంభిస్తారు. ఇక్కడ మాత్రం కాలువలు తవ్వకుండానే రిజర్వాయర్లు కట్టారు. వేసవి జలాశయానికి పుత్తూరు-చిత్తూరు రోడ్డు చిన్నరాజుకుప్పం నుంచి ప్రధాన కాలువ నుంచి పైపులైన్లు ద్వారా నీటిని తీసుకొచ్చేలా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ప్రధాన కాలువ నుంచి పైపులైన్లు వేయడం గమనార్హం. నీళ్లు రావని తెలిసినా.. అధికారులు కావాలనే ఇలాంటి ప్రతిపాదనలు తయారుచేశారు. గుత్తేదారులకు కాసులు మిగిలాయి తప్ప ప్రజలకు దాహార్తిని తీర్చలేకపోయింది. పుత్తూరు చెరువుగా ఉన్నప్పుడు కొండ ప్రాంతాల నుంచి నీరు వచ్చి చేరేది. చెరువులో సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు నిర్మాణం చేపట్టడంతో ఇక్కడ నీళ్లు నిల్వ ఉండడంలేదు. భూగర్భ జలమట్టాలు పూర్తిగా పడిపోయాయి. పనులు చేసే సమయంలో చెరువుకు ఉన్న రెండు తూముల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వాటిని ధ్వంసం చేసేశారు. ఇప్పటి వరకు వాటిని బాగుచేయకపోవడం అధికారుల అలక్ష్యానికి నిదర్శనం.

సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు మూలకోన నుంచి ప్రత్యేక పైపులైన్లు వేసి వర్షాకాలంలో పైపులైన్లు ద్వారా నింపుకొనే అవకాశం ఉంది. బాగా వర్షాలు పడితే మార్చి, ఏప్రిల్‌ వరకూ మూలకోన యేటిలో నీరు పారుతుంటుంది. ఈ నీటిని అవకాశం ఉన్నప్పుడల్లా నింపుకొనే అవకాశం ఉంది. దీనికి తోడు మూలకోనలో చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేసుకుంటే ఎప్పటికీ సమస్య ఉండదు. ఆ దిశగా పాలకులు, అధికారులు చొరవచూపాల్సిన అవసరం ఉంది.

Related Posts