YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

 మార్మోగుతున్న మెడ్ టెక్ పేరు

 మార్మోగుతున్న మెడ్ టెక్ పేరు

 మార్మోగుతున్న మెడ్ టెక్ పేరు
విశాఖపట్టణం, ఏప్రిల్ 10
ధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్ (ఏఎంటీజెడ్) ఇప్పుడు అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కల్లోల కట్టడిలో మెడ్ టెక్ ఓ ముందడుగు వేసింది. ఇప్పటి వరకు ఈ వ్యాధిని గుర్తించే పరీక్షల కోసం రోజుల సమయం పడుతుండగా మెడ్ టెక్ తన ఆవిష్కరణతో కేవలం 55 నిమిషాలలోనే వ్యాధి నిర్ధారణను కనుగొనే విధంగా కిట్స్ తయారు చేసింది.ప్రస్తుతం ఒక్కో కిట్ తో ఇరవై మందికి చొప్పున పరీక్షలు చేసే విధంగా వెయ్యి కిట్లను తయారుచేసి ఏపీ ప్రభుత్వానికి అందించింది. ఈనెలాఖరుకి మరో పదివేల కిట్లు.. వెంటిలేటర్లు, కరోనా నివారణలో వాడే పీపీఈ కిట్లను కూడా తయారుచేసేందుకు సిద్ధమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే మెడ్ టెక్ జోన్ ఒక్కసారిగా జోరు పెంచి దేశం దృష్టిని ఆకర్శించేసింది.ఇంకేముంది యధావిధిగా మెడ్ టెక్ తెచ్చిన సక్సెస్ మైలేజీ కోసం ప్రభుత్వం-ప్రతిపక్ష పార్టీలు యుద్ధం మొదలుపెట్టాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి పదినెలల కృషి ఫలితమే మెడ్ టెక్ లో ఆవిష్కరణలు అంటూ ఆ పార్టీ నేతలు, సోషల్ మీడియా విగ్స్ భజన మొదలుపెట్టాయి. ఆనాడు చంద్రబాబు ముందుచూపు ఫలితమేనని ప్రతిపక్ష టీడీపీ నేతలు, ఆ పార్టీ వర్గాలు కూడా కౌంటర్లు మొదలుపెట్టాయి.అయితే, అసలు ఈ మెడ్ టెక్ ఏంటి? దీని వ్యవహారం ఏంటో ముందు ఒకసారి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియాలో భాగంగా దేశంలో మెడికల్ హబ్ మాదిరి ఒక జోన్ ఏర్పాటు చేయాలనుకుంది. అవకాశాలు ఎక్కడా ఉన్నా వెతికి పట్టి రాష్ట్రానికి తెచ్చే నైజం కలిగిన అప్పటి సీఎం చంద్రబాబు అప్పుడు కేంద్రంతో ఉన్న సామరస్య సంబంధాలతో దానిని ఏపీకి దక్కేలా చేశారు.విశాఖ ఉక్కు నగరంలో మొత్తం 270 ఎకరాల భూమిని కేటాయించి మెడ్ టెక్ జోన్ కి 2016 లో చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఏడాదికి అందులో కార్యకలాపాలు కూడా మొదలుపెట్టారు. అయితే, విదేశీ మెడికల్ కంపెనీలు పెద్దగా ఇక్కడకి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అయినా నిరుత్సాహపడని అప్పటి ప్రభుత్వం స్వదేశీ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నం మొదలుపెట్టారు. ముందుగా అప్పటికే కేంద్రంలో ఆరోగ్యశాఖలో వివిధ విధులను నిర్వర్తించిన జితేందర్ శర్మను మెడ్ టెక్ జోన్ సీఈఓ, ఎండీగా చంద్రబాబు నియమించారు. చంద్రబాబుకి అత్యంత దగ్గరగా ఉండే సివిల్ సర్వీస్ వ్యక్తులలో జితేందర్ కూడా ఒకరని ఆయా వర్గాలలో ఒక టాక్ వినిపిస్తుంటుంది. అలా జితేందర్ ను మెడ్ టెక్ జోన్ అధికారాలను అప్పగిస్తూ మెల్లగా ఉత్పత్తులను బయటకి తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు.అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మెడ్ టెక్ జోన్ పెద్ద కుంభకోణంగా పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది. సీఈఓ జితేందర్ శర్మ, చంద్రబాబు కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని రచ్చరచ్చ చేసేసింది. వైసీపీ సొంత పత్రిక ఏపీ ఎడిషన్, విశాఖ సిటీ ఎడిషన్ లో అయితే పనిగట్టుకొని కొన్ని నెలల పాటు దీనిపై విస్తృత ప్రచారం చేసింది. అక్కడ సీన్ కట్ చేస్తే ఎన్నికలు రావడం.. వైసీపీ గెలుపు తెలిసిందే.జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత గత ప్రభుత్వం గుర్తులు తొలగించే క్రమంలో జితేందర్ శర్మని సీఈఓగా తొలగించేసి కార్తికేయ మిశ్రాకి దాని బాధ్యతలను అప్పగించారు. అప్పటికే అవినీతి ఆరోపణలతో వెనకబడిపోతున్న మెడ్ టెక్ జోన్ జితేందర్ తొలగింపుతో కునారిల్లుతూ వచ్చింది. గత మూడేళ్ళలో వచ్చిన కొన్ని కంపెనీలు ఈ దశలో తిరుగుముఖం పట్టాయి. విశాఖ ప్రజలే మెడ్ టెక్ జోన్ పై ఆశలు వదులుకునే స్థితికి చేరింది.సీఎం జగన్ రాజధాని-మూడు ముక్కల ఆటలో భాగంగా విశాఖపై ప్రేమ పుట్టుకొచ్చి 2020 సంవత్సరంలో మెడ్ టెక్ కి మళ్ళీ మంచి రోజులొచ్చాయి. జనవరి 30న మళ్ళీ జితేందర్ శర్మ మెడ్ టెక్ జోన్ పగ్గాలు అందుకున్నారు. గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖలో ఉన్న మెడ్ టెక్ జోన్ ఈ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖలోకి రావడంతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జితేందర్ ను మళ్ళీ సీఈఓగా తెచ్చేందుకు కృషి చేశారని చెప్తారు.మొత్తంగా మళ్ళీ రెండు నెలల కాలంలో మెడ్ టెక్ జోరు పెంచింది. దాని ఫలితమే ఈనాడు కరోనా కల్లోలంలో ఏపీకి అండగా మారడంతో పాటు దేశం దృష్టిని కూడా ఆకర్షించేసింది. అయితే గత పదినెలల కాలంలో వైసీపీ మెడ్ టెక్ జోన్ కోసం ఏమైనా చేసిందో లేదో కానీ కరోనా టెస్టింగ్ ర్యాపిడ్ కిట్స్ ఆవిష్కరణను మాత్రం తన ఖాతాలో వేసుకొనేందుకు గట్టిగానే ప్రయత్నించింది.ఎన్నడూ లేని విధంగా మంత్రి గౌతమ్ రెడ్డి మీడియా మీట్ పెట్టి మెడ్ టెక్ ను, సీఈఓ జితేందర్ ను ఆకాశానికి ఎత్తేశారు. అక్కడ నుండి యధావిధిగా ఆ పార్టీ నేతలు, సోషల్ మీడియాలో సీఎం జగన్ కృషి, పట్టుదల అంటూ భజనలు మొదలయ్యాయి. దానికి టీడీపీ కౌంటర్లు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికైనా మెడ్ టెక్ ప్రాధాన్యత తెలుసుకున్నందుకు చాలా సంతోషం అంటూ ఏకంగా చంద్రబాబే జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసే వరకు వెళ్ళింది

Related Posts