కరీంనగర్ : ఈ-పోస్ ద్వారా రేషన్ సరకులు పంపిణీ జరుగుతున్నా కిరోసిన్ పంపిణలో మాత్రం అక్రమాలు ఆగడం లేదు. రేషన్ బియ్యం ఇతర సరకులకు మాత్రమే ఈ-పోస్ విధానం అమలవుతుండగా కిరోసిన్ పంపిణీ మాత్రం పాత పద్ధతి ప్రకారమే సాగుతోంది. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లు పలువురు డీలర్లు స్వాహాకు తెరదీస్తున్నారు. నిబంధనలు తోసిరాజని విచ్చలవిడిగా వ్యవహరిస్తుంటే నిలువరించాల్సిన పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖ మామూళ్ల మత్తులో మొద్దునిద్ర నటిస్తున్నాయి. పత్రికల్లో కథనాలు వస్తే తప్పా ఏనాడు అటువైపు కన్నెత్తి చూడకపోగా మాటల గారడీతో ఉన్నతాధికారులను మభ్యపెట్టడం.. అక్రమాలతో అంటకాగడం.. రివాజుగా సాగుతోంది.
జిల్లాలో రాయితీ కిరోసిన్ భారీగా పక్కదారి పట్టడంలో ఆ ఇద్దరే కీలకంగా వ్యవహరిస్తున్నారని పక్కా సమాచారం. జిల్లాకు చెందిన భాస్కర్, రాజేశం అనే వ్యక్తులు ప్రతి నెలా వేల లీటర్లు నల్లబజారుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే దందాలో మునిగితేలుతుండగా ఎక్కడ విక్రయించాలి, ఏ మార్గాలు అనుకూలమో సకలం తెలియడంతో గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నారు. హెచ్చు డీలర్లు వచ్చే కిరోసిన్ కోటాలో సగానికి పైగా స్వాహా చేస్తుండగా వాటిని రహస్య ప్రాంతాల్లో డంపు చేస్తున్నారు. తమకు అనుకూలమైన అధికారులు విధులు నిర్వహించే సమయంలో సదరు కిరోసిన్‌ను వ్యాన్, ఆటోల్లోకి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాకు ఓ అసోసియేషన్ నేత సంపూర్ణ సహకారముండటంతో వ్యాపారానికి బార్లా తలుపులు తెరిచినట్లయింది. ఇందులో సంబంధిత శాఖకు చెందిన ఓ అధికారి సహకారముండటంతో అటువైపు వెళ్లేవారిని నయానో బయానాతో సరిపుచ్చుతున్నట్లు సమాచారం.
కిరోసిన్ పూరిగుడిసెల్లో ఉండేవారు మినహా ఎవరూ తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. పైగా ఒకటే లీటరు వస్తుండటం అంత్యోదయ కార్డున్నవారికి 2 లీటర్లు పంపిణీ చేస్తున్నారు. గతంలో 4 లీటర్ల వరకు పంపిణీ చేసేవారు. కాలక్రమేణ కోటా తగ్గించగా పలువురు డీలర్లకు మరింత అక్రమ మార్గానికి సులువైంది. లీటరు కోసం ఎవరెళతారనే కారణం ఒకటైతే దాదాపుగా అందరికీ గ్యాస్ కనెక్షన్లున్నాయి. రేషన్ దుకాణంలో కిరోసిన్ లీటరు ధర రూ.23 కాగా నల్లబజారులో రూ.40కి పైగా పలుకుతోంది. దీంతో ఒక్కో దుకాణంలో 40శాతం వరకు కార్డుదారులకు చేరుతుండగా మిగతాదంతా దొడ్డిదారే. ఇక రేషన్ దుకాణానికి కిరోసిన్ సరఫరా చేయకుండానే సరఫరాదారుతో కుమ్మక్కై అటునుంచి అటే నల్లబజారుకు తరలిస్తున్న ఘటనలూ లేకపోలేదు. సంబంధిత శాఖల దాడుల ఊసే లేకపోవడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు అడపాదడపా చేస్తున్న దాడులతో వేల లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. అదే అధికారులే నిక్కచ్చిగా వ్యవహరిస్తే సగం కిరోసిన్‌ను పట్టుకునే వీలుంది. ఉమ్మడి జిల్లాలో జిల్లాకేంద్రంతో పాటు కొత్త జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ కలుపుతున్నట్లు సమాచారం. వేయిలీటర్లకు 100 లీటర్ల చొప్పున ఇతర ద్రావణాలతో కలుపుతున్నారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పాటు గ్రానైట్, రోడు రోడ్డుపనులకు వినియోగించే యంత్రాలు, పాఠశాల, కళాశాలల వ్యాన్లు, లారీలకు వినియోగిస్తున్నారు. మార్కెట్‌లో డీజిల్, పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉండటం కిరోసిన్ రూ.40కి దొరుకుతుండటంతో కిరోసిన్‌కే మొగ్గుచూపుతున్నారు.
ప్రభుత్వం సరఫరా చేసే కిరోసిన్‌ను నిర్దేశిత ప్రాంతంలో కార్డుదారులకు పంపిణీ చేయాలి. దర్జాగా నిబంధనలను విస్మరిస్తుండగా అధికారుల పర్యవేక్షణ ఎంత ఘనంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో పలువురు డీలర్లు కిరోసిన్ డీడీలు కట్టడం లేదు. భారీమొత్తంలో కిరోసిన్ మిగులుతుండటంతో ఎందుకీ అపప్రదంటూ చాలించుకోగా అక్రమాలతో అనుబంధమున్న కొందరు డీలర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. రెండు, నుంచి మూడు కిరోసిన్ దుకాణాల డీడీలు చెల్లించడం సదరు కిరోసిన్‌ను ఎక్కడో ఒక చోట పంపిణీ చేసినట్లు చేసి పక్కదారి పట్టిస్తున్నారని కార్డుదారులు చెబుతున్నారు. ఏ రేషన్ దుకాణానికి చెందిన కిరోసిన్‌ను అక్కడే పోయాల్సి ఉండగా తమకు అనుకూలమైన ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. నగరంలోని ఓ రేషన్ దుకాణంలో కిరోసిన్ పంపిణీ చేయాల్సి ఉండగా అది ఎక్కడ పంపిణీ చేస్తున్నారో తెలియడం లేదని కార్డుదారు రాధ వివరించడం గమనార్హం.
ప్రతి నెల 20నుంచి 28వరకు కిరోసిన్ డీలర్లు తప్పనిసరిగా కిరోసిన్ పంపిణీ చేయాలి. ప్రతి దుకాణానికి డీలర్ ఫోటోతో ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించాలి. ఒకరు ఉదయం పంపిణీ చేస్తే మరొకరు సాయంత్రం పంపిణీ చేస్తుండగా నిబంధనల ప్రకారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు కిరోసిన్ పోసే దుకాణముంటే సంతోషించాల్సిందే. ట్యాంకర్ ద్వారా రేషన్ దుకాణానికి కిరోసిన్ సరఫరా చేసే సమయంలో తప్పనిసరిగా సంబంధిత అధికారులండాలి. ఎన్ని లీటర్లు పోశారు.. కేటాయింపు ఎంతనే కోణంలో పరిశీలించి సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ సంబంధిత అధికారులు వారితో ఉన్న సన్నిహిత బంధంతో కార్యాలయాల వద్ద లేదా కలిసిన చోట సంతకాలు పెడుతూ వారి వారి వాటాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.